Fake messages in the name of Collector Suryakumari
కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ గురించి తెలియని వారి నుంచి ఇంతో అంతో తెలిసిన సామాన్యుడి వరకు ఏదో ఒక రూపంలో సైబర్ దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది వారి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల రాజకీయ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి.. వారే డబ్బు అడుగుతున్నట్లుగా మనీ అడుగుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. అయితే తాజాగా ఏకంగా ఓ కలెక్టర్ పేరుతో కేటుగాళ్లు మరో డ్రామాకు తెరలేపారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా కలెక్టర్ పేరుతో సైబర్ నేరగాళ్లు అధికారులకు ఫేక్ మెసేజ్‌లు పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అధికారులు అలెర్ట్ చేశారు.
జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ ఫొటోతో, సెల్ నెంబర్లు 9439140791, 9439140733, 9439139978, 7381276244 నుంచి వాట్సాప్ ద్వారా, పలు ఆదేశాలు, సూచనలు వెలువడుతున్నాయని, వీటితో జిల్లా యంత్రాంగానికి ఎటువంటి సంబంధమూ లేదని కలెక్టర్ సూర్యకుమారి స్పష్టం చేశారు. ఈ ఫోన్ నంబర్లు నుంచి వచ్చే ఆదేశాలను పట్టించుకోవద్దని జిల్లా అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు కలెక్టర్ సూచించారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు సమాచారాన్ని అందజేయడం జరిగిందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.