Bobbili Tragedy: విజయనగరం జిల్లా బొబ్బిలిలో స్కూల్ విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న కొట్లాట ఒక విద్యార్థి ప్రాణం తీసింది.
సుందరాడ కార్తీక్ అనే విద్యార్థి మృతికి అభ్యుదయ స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలని అంబేద్కర్ పోరాట సమితి డిమాండ్ చేస్తోంది. అయితే, నిన్న సాయంత్రం స్కూల్ వదిలి తర్వాత బొబ్బిలి కోటలో వాకా చైతన్య, సుందరాడ కార్తీక్ మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. కోపంతో చైతన్య, కార్తిక్‌పై పిడిగుద్దులతో దాడికి పాల్పడి, తీవ్రంగా గాయపరిచాడు. ఇక, గాయాల తీవ్రతతో బొబ్బిలి కోటలోనే కార్తీక్ మరణించాడు. మృతదేహాన్ని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గదిలో ఉంచారు.
Read Also: Gandikota: గండికోటలో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. నిందితుల కోసం గాలింపు..!
అయితే, సుందరాడ కార్తీక్ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ పోరాట సమితి డిమాండ్ చేసింది. అలాగే, అభ్యుదయ పాఠశాలకు చెందిన డ్రిల్ మాస్టర్ ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. దీంతో పాటు బొబ్బిలి మండల విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక, మృతుని కుటుంబానికి న్యాయం జరగాలంటూ అంబేద్కర్ పోరాట సమితి పోరాటానికి దిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థుల భద్రతపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి.