Site icon NTV Telugu

YS Jagan: సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు జగన్‌ పరామర్శ.. ఇది ప్రభుత్వ వైఫల్యమే..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: విశాఖ జిల్లా సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మధురవాడలోని చంద్రవరంకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడం విషాదాన్ని నింపింది.. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. మృతదేహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన జగన్.. ఈ ఘటన దురదృష్టకరం అన్నారు.. అయితే, సింహాచలం ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అని విమర్శించారు.. ఆరు రోజుల కిందట గోడ నిర్మాణం చేపట్టి రెండు రోజుల కిందట పూర్తి చేశారు.. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా ? చందనోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు.. సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఏడుగురిని బలిగొన్నారని మండిపడ్డారు.. నాడు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఘటన, నేడు విశాఖలో సింహాచలం ఘటన భక్తుల ప్రాణాలు బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఘటనలు జరిగిన తర్వాత కమిషన్ వేస్తానంటారు.. కానీ, ఎవరిపైన చర్యలు ఉండవు.. ఎందుకంటే చంద్రబాబే దోషి కనుక అన్నారు..

Read Also: CM Revanth Reddy: తెలంగాణ నిర్ణయాన్ని దేశం అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉంది..!

ఘటన జరిగే ముందు ఉద్యోగాలు ఊడతాయని అధికారులు భయం ఉండాలి.. చంద్రబాబు తీసుకునేవి కంటి తుడుపు చర్యలు కనుక ఎవరికీ భయం లేదన్నారు వైఎస్ జగన్.. చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడడం ఆనవాయితీ.. వర్షం వస్తుందని తెలిసినా కూడా గోడ పక్కన భక్తులను ఎందుకు నిలబెట్టారు? అని ప్రశ్నించారు.. చందనోత్సవం కోసం వేసిన మంత్రుల కమిటీ ఏం చేస్తుంది..? సింహాచలం ఘటన ప్రభుత్వ తప్పిదమే అన్నారు.. ప్రభుత్వం బాధ్యత వహించి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి.. లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి రూపాయలకు మిగిలిన మొత్తాన్ని మేం ఇస్తాం అంటూ మృతుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్..

Exit mobile version