CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం

Cbn

Cbn

CM Chandrababu: 40 ఏళ్లుగా తమ ఇళ్లపై పూర్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల కల సాకారం కానుంది. విశాఖపట్నం వేదికగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న 28,445 కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హక్కుదారు పట్టాలను పంపిణీ చేయనున్నారు. దీని విలువ రూ.8,874 కోట్లు. మొత్తం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ 19,33,853 చదరపు గజాలను పేద కుటుంబాలకు హక్కులు కల్పించనున్నారు. విశాఖలో ఇంత పెద్ద ఎత్తున క్రమబద్ధీకరణ చేపట్టి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఇదే తొలిసారి. ఇల్లు నిర్మించుకుని దశాబ్దాలుగా అందులో నివసిస్తున్నా.. ఆ ఇంటి స్థలంపై పూర్తి హక్కు లేకపోవడం అనేక కుటుంబాలను వేధిస్తున్న సమస్య. పట్టా లేకపోవడంతో ఆస్తిని పూర్తిస్థాయిలో అనుభవించలేని పరిస్థితి.. బదలాయించుకోక… భవిష్యత్తుపై భరోసా లేకపోవడం వంటి సమస్యలకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇవాళ సీఎం చంద్రబాబు చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీతో ఇన్నాళ్లూ పడిన కష్టాలు గట్టెక్కనున్నాయి. విలువైన ఆస్తి, భవిష్యత్తుకు భద్రత, పిల్లలకు వారసత్వ సంపద, ఆత్మగౌరవం, భరోసా కల్పించేలా అంగరంగ వైభవంగా విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది.

కాగా, తన విశాఖ పర్యటనపై సోషల్ మీడియా వేదికగా శుక్రవారం రోజు స్పందించిన సీఎం చంద్రబాబు.. ”దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది…తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు విశాఖ వస్తున్నా!” అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు… ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం. ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు… 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది… భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది….. బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది… ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి.. అంటూ ట్వీట్‌ చేశారు సీఎం చంద్రబాబు..