ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖలు రాశారు. విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ అంశాల పై వేర్వేరుగా సీఎం జగన్ లేఖలు రాశారు. ఏపీ ఆర్ధిక అభివృద్ధిలో విశాఖ నగరం కీలకపాత్ర పోషిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. పర్యాటక కేంద్రంగా, పారిశ్రామికంగా ఈ నగరం నుంచి విమానాల రాకపోకలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఉందని ఆయన అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని, ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలో విస్తరణ, రాకపోకలు పెంచేందుకు భౌగోళిక ఇబ్బందులు ఉన్నాయని ఆయన తెలిపారు.
రక్షణ శాఖకు కూడా అత్యంత కీలకమైన ఎయిర్ బేస్ ఇది అని, ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్ పోర్టును త్వరితగతిన నిర్మించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం సైట్ క్లియరెన్సు అనుమతిని పునరుద్ధరించాలని, ఈ విమానాశ్రయం అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు భాగస్వామిని ఏపీ ప్రభుత్వం గుర్తించిందని ఆయన వెల్లడించారు. ఎన్ఓసీ లేని కారణంగా నిర్మాణ పనులు చేపట్టలేని పరిస్థితి ఉందని, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసేందుకు తక్షణమే సైట్ క్లియరెన్స్ అనుమతి ఇవ్వాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.