విమానం ఎక్కితే మంచి టేస్టీ ఫుడ్ తినవచ్చు. కేవలం అందులో ప్రయాణించేవారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. అయితే అక్కడ ఇప్పుడు భోజనానికి విమానం ఎక్కుతున్నారు. అదేం బొమ్మ విమానం కాదు నిజమైన విమానం. విజయవాడ సిటీ దాటి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి వెళ్లే దారిలో హైవే పక్కన ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఒక్కసారిగా చూసే ఎవరికైనా, నిజంగా ఫ్లైట్ ల్యాండ్ అయిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. సాధారణంగా ఫ్లైట్ వెళ్తుంది అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఆటోమేటిక్ గా తల పైకి ఎత్తుతారు, అలాంటిది అదే ఫ్లైట్ రోడ్ పక్కనే కనిపిస్తూ బిర్యానీ తినటానికి వెల్కమ్ చెబుతుంటే ఆ కిక్ మామూలుగా వుండదు.
గన్నవరం జాతీయ రహదారిపై నిడమానూరు వద్ద మూలనపడ్డ ఓ పాత విమానంలో కొత్త రూపు తీసుకుని వచ్చి ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్లుగానే ప్రతి విషయంలో బెజవాడ నగరవాసులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటూనే వుంటారు. ఈ ఫీవర్ ఇప్పుడు ఫుడ్ విషయంలో, రెస్టారెంట్ల విషయంలో అధికంగా ఉంది. ఇప్పటి వరకు ట్రైన్ రెస్టారెంట్, జైల్ రెస్టారెంట్, బోట్ రెస్టారెంట్, రోబో రెస్టారెంట్ లాంటివి అందరూ చూసుంటారు. వీటన్నిటికీ భిన్నంగా ఏకంగా విమాన్ రెస్టారెంట్ కల్చర్ నగరంలో అడుగు పెట్టింది… దేశంలో నాలుగుచోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రెస్టారెంట్లు ప్రస్తుతం విజయవాడలో కూడా వుండటం కనువిందుగా మారింది. విమానంలో ప్రయాణించటం ఒక లెక్క అయితే , కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం, పిల్లలతో కలిసి గేమ్స్ ఆడుకోవడం లాంటివి ఇక్కడి ప్రత్యేకత.
ఎయిర్‌ఇండియాకు చెందిన 44 మీటర్ల పొడవు కలిగిన బోయింగ్ 737 విమానాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు చాలానే శ్రమించారు రెస్టారెంట్ యాజమాన్యం..ఈ రెస్టారెంట్ పెట్టడానికి తీసుకునే పర్మిషన్స్ ఒక లెక్క అయితే ఆ విమానాన్ని ఢిల్లీ నుండి బెజవాడ తీసుకుని రావటం మరో లెక్క అంటున్నారు. 60 ఫీట్ల ట్రైలర్ ట్రక్‌లో సుమారు 50 రోజుల పాటు రోడ్డు మార్గంలో నలుగురు నిపుణుల సారథ్యంలో తీసుకుని వచ్చి ఏరోనాటికల్ ఇంజనీర్స్ తో దీనిని ఏర్పాటు చేశారు.
ఈ విమానం ఖరీదుకు కోట్ల రూపాయలు వెచ్చించగా ఢిల్లీ నుంచి నగరానికి తీసుకురావడానికే 12లక్షలకు పైగా ఖర్చు చేయడం విశేషం. దీనికి ఏపీ టూరిజం సహకారం కూడా ఉండటం మరింత సులువైంది అంటున్నారు యాజమాన్యం. ఈవిమానానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ఇంజన్ ఇంకా వర్కింగ్ కండిషన్లోనే వుంది. దీని కక్ పీట్ లో ఇప్పటివరకు ఒక్క స్విచ్ కూడా తియ్యలేదు. నేచురల్ గా ఉండాలనే పట్టుదల మీద ఫ్లైట్ ను ఏ మాత్రం డామేజ్ చెయ్యకుండా అలానే సెట్ చేశారు. నిజంగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేవిధంగా వింగ్స్ సపోర్ట్ తో వీటిని ఏర్పాటు చేశారు. ఈ విమాన్ రెస్టారెంట్ కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది.
Viman restaurant vijayawada
ఈ విమానాన్ని రెస్టారెంట్‌కు అనువుగా తీర్చిదిద్దారు.ఇంటీరియర్స్‌ను చెక్కతో డిజైన్ చేసి చక్కటి లైటింగ్స్ పెట్టారు. బాడీ మొత్తం ఆకర్షణీయమైన కలర్ తో ముస్తాబు చేశారు. కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు సెంట్రల్ ఏసీ ఫుడ్ కోర్టు స్టాల్స్‌తో పాటు వైటింగ్ చేసే వాళ్లకు ఇబ్బంది కలగకుండా పిల్లలకు ,పెద్దలకు గేమ్స్ ఆడుకునేందుకు గేమింగ్ జోన్ వుంది. మొత్తం 189 ప్యాసింజర్స్ కెపాసిటీ కలిగిన ఈ బోయింగ్ విమాన రెస్టారెంట్‌లో 80 మంది సౌకర్యవంతంగా కూర్చునే విధంగా మార్చారు. భోజనప్రియుల కోసం ఈ విమాన రెస్టారెంట్‌లో కొత్త కొత్త వెజ్, నాన్‌వెజ్ రుచులు అందించేందుకు నార్త్,చైనీస్ వెస్ట్ బెంగాల్, ఆంధ్రా, గోదావరి రుచులతో పాటు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డిష్‌లు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. వైజాగ్ టూ చెన్నై, తిరుపతి ఇలా ఈ హైవే పై వెళ్లే ఎవరైనా ఇక్కడ ఆగాల్సిందే.
పిల్లల సందడి, పెద్దల సెల్ఫీలతో మొత్తానికి బెజవాడ వాసులకు ఒక్క చక్కటి అనుభూతినిచే ప్లేస్ దొరికిందంటున్నారు. ఎప్పుడూ విమానం ఎక్కని వాళ్ళకి, చూడని వాళ్ళకి ఇది చక్కటి అనుభవం అంటున్నారు. వేలరూపాయలు టికెట్ కొని విమానం ఎక్కడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ విమానం ఎక్కి కాసేపు అక్కడే వుండి.. టిఫిన్ తింటూ కాలక్షేపం చేయడం కావాలంటే మాత్రం విజయవాడ వెళ్లాల్సిందే.