Fake Liquor Case: నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ పోలీసులు తొలిరోజు కొద్దిసేపు మాత్రమే విచారించారు. కేసులో ఏ18గా జోగి రమేష్, ఏ19గా జోగి రాము ఉన్నారు. ఇద్దరినీ 4 రోజులపాటు విచారించటానికి ఎక్సైజ్ కోర్టు అనుమతి ఇవ్వటంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఇద్దరినీ విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో జోగి బ్రదర్స్ విజయవాడలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఇద్దరినీ సుమారు అరగంటపాటు ఎక్సైజ్ పోలీసులు విచారించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ1 అద్దేపల్లి జనార్ధన్ తాను నకిలీ మద్యం తయారీకి సంబంధించి జోగి రమేష్ ఉన్నారని చెప్పటంతో పోలీసులు అద్దేపల్లితో ఉన్న లింకులపై జోగిని ప్రశ్నించారు.
Read Also: Apple MacBook Air M1: ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 రూ.50,000 కంటే తక్కువ ధరకే.. త్వరపడండి
అద్దేపల్లి జనార్ధన్ ఆఫ్రికా వెళ్ళక ముందు జోగిని కలిసి భేటీ కావటంపై కూడా జోగిని అధికారులు ప్రశ్నించారు. జోగి బ్రదర్స్ కు అద్దేపల్లి బ్రదర్స్ కు మద్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలను గురించి అడిగి ప్రశ్నించారు. అద్దేపల్లి తాను నకిలీ మద్యం తయారు చేయటం వెనుక కారణం జోగి రమేష్ అని చెప్పారని దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. డబ్బులు కూడా పలుమార్లు ఇచ్చినట్టు చెప్పారని కొన్ని ఆధారాలను చూపించి ప్రశ్నించారు. తనకు ఈ కేసుతో సంబంధంలేదని జోగి రమేష్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అనంతరం జోగి బ్రదర్స్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. రేపు ఉదయం కస్టడీకి తీసుకుని విచారించనున్నారు అధికారులు..