ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్…సబ్‌కా సాథ్ కాదు సబ్‌కా హాత్ అని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌ను దుయ్యబట్టిన విజయసాయి రెడ్డి.. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ఈ బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్… కానీ పేషెంట్ డెడ్ అంటూ కేంద్రానికి చురకలు అంటించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ బడ్జెట్ అవుతుందేమోనని ఊహించామని, బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత ఇది ఏ రాష్ట్రానికి చెందని బడ్జెట్ అని తేలిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రాలకు ఆత్మనిర్భరత ఎక్కడుందని, కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కేంద్రం తగ్గించిందని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్, సెస్సులో రాష్ట్రాలకు ఇచ్చిందెంత.. కేంద్ర ప్రభుత్వం డివిజబుల్ పూల్ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్ వాటా నానాటికీ తగ్గిపోతోందన ఆయన అన్నారు. మధ్యతరగతికి బడ్జెట్‌తో ఊరట లేదని, ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌ను సులభతరం చేయాలని ఆయన అన్నారు. ఐటీ పోర్టల్‌లో లోపాలు సరిదిద్దాలని, సబ్సిడీలకు అడ్డగోలుగా కోతలు విధించారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద ఇచ్చిన ప్రధాన హామీలైన వైజాగ్ రైల్వే జోన్, వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ ఏడేళ్ళు పూర్తయినా కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు.