ఇవాళ ఉదయం రామతీర్థం వద్ద జరిగిన సంఘటనపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారమే అశోక్ గజపతిరాజును ఆహ్వానించామని.. శిలా ఫలకంపై పేర్లు వేసే పద్ధతి గత ప్రభుత్వంలో చేయలేదని గుర్తు చేశారు. అధికారులు మర్యాదలు చేయబోతుంటే ఆయనే అడ్డుకున్నారని మండిపడ్డారు. అశోక గజపతి రాజుకు రాజకీయ మనుగడ లేకే.. ఇలాంటి రాజకీయాలకు పాల్ప డుతున్నారని ఆగ్రహించారు. దేవుళ్ళ మీద రాజకీయం చేసే వారిని శ్రీరాముడు శిక్షిస్తాడని… చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో జరిగిన భూకబ్జాలను తిరిగి రాబడుతున్నామన్నారు.
ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీ అని వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామని… రూల్స్ ప్రకారం ఇక్కడ అన్నీ జరుగుతున్నాయని చెప్పారు. తమకు ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువా కాదన్నారు. కొండపైన విగ్రహాలు ధ్వంసం అయినప్పుడు, వాటి స్థానంలో మేము వేరే విగ్రహాలు పెట్టి తూతూమంత్రంగా చేతులు దులుపు కోలేదని…నాలుగు కోట్ల వ్యయంతో నూతన ఆలయం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ కర్తగా, మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు ఆలయ అభివృద్ధికి నిధులు తీసుకురాలేదని ఫైర్ అయ్యారు.