ఏపీ ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూర్చే దిశగా రవాణాశాఖ కసరత్తు ప్రారంభించింది. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గణనీయంగా పెంచుతూ గురువారం రాత్రి రవాణా శాఖ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గరిష్టంగా రూ. 2 లక్షలు, కనిష్టంగా రూ. 5 వేల వరకు రవాణా శాఖ ప్రతిపాదించింది. పెంపు కారణంగా ఏడాది కాలానికి రూ. 100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
9999 ఫ్యాన్సీ నెంబరుకు రూ. 2 లక్షల మేర రిజిస్ట్రేషన్ ఫీజుగా రవాణా శాఖ నిర్ణయించింది. 1, 9, 9999 ఫ్యాన్సీ నెంబర్లకు రూ. లక్ష మేర రిజిస్ట్రేషన్ ఫీజుగా స్పష్టం చేసింది. వివిధ ఫ్యాన్సీ నెంబర్లకు రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేల మేర రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ధారించింది. ఒకరి కంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ రేట్ల ఆధారంగా ఫ్యాన్సీ నంబర్లను రవాణా శాఖ అధికారులు వేలం వేయనున్నారు. ఈ మేరకు చట్ట సవరణ కోసం ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన 15 రోజుల్లోగా అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపాలని ప్రభుత్వం సూచించింది.