అమరావతి : సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనపై సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. రెండున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ దళితులను అన్ని విధాల వంచించారని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి రూ.26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారని నిప్పులు చెరిగారు వర్ల రామయ్య.
దారి మళ్లిన సబ్ ప్లాన్ నిధులను తిరిగి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల బాధలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే అయ్యిందని ఆగ్రహించారు వర్ల రామయ్య. ప్రభుత్వ పరిపాలన అధికారి సీఎస్సే కాబట్టే.. లేఖ రాశామని వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను అన్యాయంగా ప్రభుత్వమే లాక్కుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వర్ల రామయ్య.