Vallabhaneni Vamsi: గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు విచారించిన తర్వాత కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులోనిసెల్ లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా హెల్త్ ప్రోబ్లం వస్తే ఇబ్బందని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. తనతో పాటు వేరే వారిని కూడా సెల్ లో ఉంచాలని జడ్జిని కోరారు. భద్రత పరంగా తనకు ఇబ్బంది లేదని కూడా చెప్పారు. అలాగే, సత్య వర్ధన్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని వంశీ వెల్లడించారు. తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని జడ్జికి వల్లభనేని వంశీ తెలిపారు.
Read Also: Harish Rao : మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు.. ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా.
అయితే, వేరే వారితో ఉంచినపుడు వల్లభనేని వంశీకి ఏమైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా వంశీని జడ్జి అడిగారు. వంశీ భద్రత దృష్ట్యా మాత్రమే సెల్ లో ఒంటరిగా ఉంచామని జడ్జికి ఏపీ సర్కార్ తెలిపింది. హెల్త్ పరిశీలనకు ఒక వార్డెన్ ను ఏర్పాటు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయమూర్తికి తెలిపింది. కాగా, వంశీతో పాటు వేరే వ్యక్తిని సెల్ ఉంచేందుకు ఇంఛార్జ్ జడ్జిగా తాను ఆదేశాలు ఇవ్వలేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. రేపు రెగ్యులర్ కోర్టులో మెమో ఫైల్ చేసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.