ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే తీవ్ర ప్రయాసల నడుమ భారత్ చేరుకున్న విద్యార్థుల ఆనందం అంతా ఇంతా కాదు. వారిలో ఏపీకి చెందిన వందల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఏపీ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి పొరుగుదేశాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులందరూ క్షేమంగా స్వస్థలాలకు చేరుకునేందుకు కృషి చేసింది.
కాగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థులు సోమవారం నాడు అసెంబ్లీలో సీఎం జగన్‌ను కలిశారు. తమ పట్ల శ్రద్ధ చూపించిన సీఎం జగన్‌కు విద్యార్థులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పెయింటింగ్‌ను బహూకరించారు. మరికొన్ని బహుమతులు కూడా అందజేశారు. అనంతరం విద్యార్థులతో సీఎం జగన్ ఆప్యాయంగా ముచ్చటించారు. ఉక్రెయిన్‌లో నెలకొన్ని పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వారు కోర్సులను ఎంతవరకు పూర్తి చేశారో ఆరా తీశారు. తదుపరి వారి కోర్సులు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వపరంగా అండగా నిలుస్తామని సీఎం జగన్ విద్యార్థులకు హామీ ఇచ్చారు.