Twist In Guntur Beautician Case: గుంటూరులో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. తొలుత స్థలం గొడవ విషయంలో భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడని అనుకుంటే.. విచారణలో భాగంగా ‘వివాహేతర సంబంధం’ కోణం బయటపడింది. పక్కింటి వ్యక్తితో తన భార్య ఎఫైర్ నడుపుతోందన్న అనుమానంతోనే భర్త ఆమెను పార్లర్‌లోనే చంపినట్టు తెలిసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
లారీ డ్రైవర్‌గా పని చేస్తోన్న కాకర్ల వెంకట కోటయ్యకు 18 ఏళ్ల క్రితం స్వాతి అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇంటర్, తొమ్మిదో తరగతి చదివే ఇద్దరు కుమారులున్నారు. స్వాతి గాంధీనగర్‌లో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. కట్ చేస్తే.. ఇంటి పక్కనే ఉండే ఒక వ్యక్తితో తన భార్య స్వాతి వివాహేతర సంబంధం పెట్టుకుందని కోటయ్య అనుమానిస్తూ వచ్చాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈనెల 15వ తేదీ కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో.. స్వాతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచే రోజూ బ్యూటీ పార్లర్‌కు వచ్చి వెళ్తుండేది. స్వాతి తనని వదిలివెళ్లిపోవడంతో కోటయ్య కక్ష పెంచుకున్నాడు. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
గురువారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. భార్య మృతి చెందిందని నిర్ధారించుకొని, పూల దండల్ని మృతదేహంపై వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన కొడుకులకు తల్లిని చంపిన విషయం చెప్పి, అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. తొలుత.. స్థలం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు వార్తలొచ్చాయి. బాకీ తీర్చడం కోసం స్థలం అమ్మాలని కోటయ్య ఒత్తిడి తెచ్చాడని.. అందుకు ఒప్పుకోకపోవడంతో కోటయ్య చంపాడని అనుకున్నారు. కానీ.. విచారణలో ఈ హత్యకు వివాహేతర సంబంధం కారణమని తేలింది.