తులసిరెడ్డి.. ఏపీ కాంగ్రెస్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఆ పార్టీలో యాక్టివ్ గా వుండే నేత తులసిరెడ్డి. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా అయిన తులసిరెడ్డి నిత్యం హాట్ కామెంట్స్ తో వార్తల్లో వుంటారు. తాజాగా ఆయన బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఏపీ రాజకీయాలపై తనదైన రీతిలో స్పందించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు (Chandrababu) జగన్ (Jaganmohan Reddy), పవన్ (Pawan Kalyan) అని కొత్త భాష్యం చెప్పారు. ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేస్తోందన్న ఆయన.. వైసీపీ, టీడీపీ, జనసేన ఆ పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. ఎనిమిది సంవత్సరాలలో విభజన చట్టంలో ఒక్క అంశాన్ని కూడా కేంద్రంలోని మోడీ సర్కార్ అమలు చేయలేదన్నారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో కాంగ్రెస్ త్వరలో చేపట్టనున్న ‘భారత్ జోడో’ యాత్ర 100 కిలోమీటర్ల మేర కొనసాగుతుందన్నారు. ఈ జోడో యాత్ర రాయదుర్గంలో ప్రారంభమై రెండు పార్లమెంటు, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తులసిరెడ్డి వివరించారు. రాష్ట్రంలో దుష్ట చతుష్టయ పార్టీలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని తులసిరెడ్డి కోరారు. నరేంద్ర మోడి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలను దీనికోసం ఉపయోగించుకుంటుందని ఫైర్ అయ్యారు. సత్యాగ్రహ ఆయుధం ద్వారా బిజెపి కక్ష రాజకీయాలను ఎదుర్కొంటామన్నారు. దేశంలో చరిత్ర పునరావృతం అవుతుంది . గతంలో జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ , చౌదరి చరణ్ సింగ్ లు ఇందిరాగాంధీని వేధించారు. ప్రజలు తర్వాతి ఎన్నికల్లో జనతా పార్టీకి బుద్ధి చెప్పారని తెలిపారు. ప్రస్తుతం నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వానికి కూడా ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఈడీ వేధిస్తోందన్నారు.
Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రితో అంబటి భేటీ