Tirumala: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది వెళ్తుంటారు. ప్రతిరోజూ శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. సెలవు దినాల్లో అయితే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. తిరుమలలో దర్శనం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ స్వామి ప్రసాదం స్వీకరించడం కూడా అంతే ముఖ్యం. అందుకే శ్రీవారి లడ్డూ తినాలని అందరూ పరితపిస్తుంటారు. దీంతో తిరుమల లడ్డూలకు తీవ్ర డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో తిరుమల లడ్డూలు బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి దర్శనం టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉందని వివరించింది. అంతేకానీ దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఎంత మాత్రం లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
Read Also: Jio 5G: గుడ్‌న్యూస్ చెప్పిన జియో.. యూజర్లకు ఇక పండగే..!
కాగా కొన్నిరోజులుగా తిరుమల లడ్డూలు కావాల్సిన వారు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో లడ్డూను బుక్ చేసుకోవచ్చని, ఇలా ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చిన వారికి హోమ్ డెలివరీ చేస్తామని టీటీడీ అధికారులు చెప్పారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. తొలి విడతలో హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు సహా కొన్ని ప్రధాన నగరాల్లో ఈ వసతిని అందుబాటులోకి తీసుకొచ్చారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దర్శనంతో సంబంధం లేకుండా భక్తులు నామమాత్రపు ధరను చెల్లించి అదనపు లడ్డూలను కూడా పొందవచ్చని కొందరు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వార్తలు పూర్తిగా ఫేక్ అని.. నమ్మి మోసపోవద్దని టీటీడీ ప్రకటించింది.
