Tirumala Brahmotsavam Celebrations: తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకంతంగానే నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా అదుపులో ఉండటంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను నాలుగు మాఢవీధుల్లో ఘనంగా నిర్వహించాలని టీటీడీ తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే తమిళులకు ఎంతో ముఖ్యమైన పెరటాసి మాసం ప్రారంభం కానుంది. దీంతో తమిళనాడు నుంచి కూడా పెద్దసంఖ్యలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు రానున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఏడాది టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు కేవలం సర్వదర్శనం మాత్రమే కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారి రద్దుచేయనుంది.
Read Also: Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!
సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకే ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేస్తుంటారు. వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, శ్రీవాణి ట్రస్టు సేవల భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన సౌకర్యాలను నిలిపివేస్తుంటారు. ఈసారి వాటితో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్‌ల జారీ కూడా నిలిపివేసింది. బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా రద్దుచేయడంతో సామాన్యులకు ఎక్కువగా దర్శనభాగ్యం కల్పించినట్లు అవుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇలా బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం భక్తులకు సర్వదర్శనం మాత్రమే కల్పించడం టీటీడీ చరిత్రలోనే తొలిసారి కానుంది. అటు ఆదివారం నాడు తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈనెల 8 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఆయా రోజుల్లో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.