ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు ఆందోళనబాట పట్టాయి.. అయితే, విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది..? ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఎంత వరకు నిజం ఉంది ? అనే విషయాలపై మీడియాతో మాట్లాడిన ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వేసవి కావడంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని.. సాధారణ రోజుల్లో 180 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉండగా.. ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం పెరిగిపోయిందన్నారు.. ఇక, పీపీఏల రద్దు వల్లే ప్రస్తుతం ఛార్జీలు పెరిగాయన్న వాదనలో నిజం లేదని కొట్టిపారేశారు ట్రాన్స్ కో ఎండీ. పీపీఏలను ప్రభుత్వం రద్దు చేయలేదన్న ఆయన.. ధరలను సమీక్షించమని కంపెనీలను కోరిందని వివరించారు. సెకీ నుంచి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని.. ఆ విద్యుత్‌ను వ్యవసాయం కోసమే వివియోగిస్తామని వెల్లడించారు శ్రీధర్.
Read Also: Breaking: డ్రగ్స్‌కు హైదరాబాద్ యువకుడి బలి.. ఇదే తొలి కేసు..!
ఇక, గతంలో దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలు అధిక ధరలకు చేసుకోవడం వల్లే ఇప్పుడు తీవ్ర నష్టం జరుగుతున్నట్టు పేర్కొన్నారు ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్.. బొగ్గు ధరల కారణంగా గతంలో కొన్ని యూనిట్లు మూసివేయాల్సి వచ్చిందన్న ఆయన.. ట్రూ అప్ ఆదాయం పెంపునకు ఏపీ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈఆర్సీ ఆమోదించిన ట్రూ అప్ ఆదాయం.. డిస్కంలకు రూ. 2100 కోట్లు పెంచింది. రిటైల్ టారిఫ్ సప్లై ఆర్డర్ ద్వారా రూ. 1400 కోట్లు, అలాగే ట్రూ అప్ మరో రూ.700 కోట్లు వసూలు చేసుకునే వెసులుబాటు ఉందని వెల్లడించారు.. ఏపీలోని అన్ని రకాల విద్యుత్ సంస్థలకు రూ. 83 వేల కోట్ల మేర అప్పు ఉందన్న ఆయన.. రూ. 1400 కోట్లు రిటైల్ టారిఫ్ సప్లై ఆర్డర్ ద్వారా డిస్కంలకు ఆదాయం వస్తోంది.. రూ. 6.90 పైసల మేర విద్యుత్ కొనుగోలు ఛార్జీ అవుతోందని.. విద్యుత్ వినియోగంలో 50 శాతం జనాభా 75 యూనిట్లలోపు టారిఫ్ లోకి వస్తారు.. 50 శాతం మంది ప్రజల మీద పెరిగిన విద్యుత్ ఛార్జీలు భారం స్వల్పంగానే ఉంటుందని వివరించారు. ప్రజల కోరిక మేరకే టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నాం.. విద్యుత్ ఛార్జీల సవరణ ద్వారా ప్రజలపై పడే భారం స్వల్పమే అన్నారు.. ఇక, విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వానిది కాదు.. ఈఆర్సీదే అన్నారు ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్.