తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో పంట నష్టం లిస్ట్ ఇదే..
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వానికి అందిన వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరంగల్ జిల్లాలో పంట నష్టం చోటు చేసుకోగా, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ రైతులు భారీగా నష్టపోయారు. తుఫాను కారణంగా ప్రధానంగా వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2.80 లక్షల ఎకరాల్లో వరి పంట, 1.50 లక్షల ఎకరాల్లో పత్తి, 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 3 వేల ఎకరాల్లో మిరప, వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంపై సమగ్ర నివేదిక సిద్ధం చేసేందుకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం.
కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర.. సిట్ దర్యాప్తులో వెలుగులోకి కీలక అంశాలు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కీలక దశకు చేరింది. ఈ కేసు వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న అరెస్టు కావడంతో పలు ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. 2022లో టీటీడీ కొనుగోలు విభాగం జీఎంను చిన్నఅప్పన్న సంప్రదించి, నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేశారు. ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే, భోలేబాబా డెయిరీ యాజమాన్యం ఈ డిమాండ్‌ను స్పష్టంగా తిరస్కరించడంతో, చిన్నఅప్పన్న కుట్ర పన్నినట్లు సిట్ గుర్తించింది. ఆ డెయిరీపై అనర్హత వేటు వేయించేందుకు టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు విచారణలో బయటపడింది. అదే కాకుండా, అజ్ఞాత వ్యక్తుల ద్వారా పిటిషన్లు వేయించుకుని డెయిరీపై అనర్హత వేటు వేయించేలా చర్యలు తీసుకున్నట్లు సిట్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ కుట్ర ఫలితంగా భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణను టీటీడీ నిలిపివేసింది.
పీఎం మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అగౌరపరిచేవిగా, ‘‘మర్యాద అన్ని హద్దులు దాటాయి’’ అని బీజేపీ పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగమైనవని, ఎగతాళి చేసేవిగా ఉన్నాయని, భారత గణతంత్ర రాజ్య అత్యున్నత రాజ్యాంగ కార్యాలయ గౌరవాన్ని అవమానించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయని చెప్పింది. బుధవారం, బీహార్‌లో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ ఆయన మీ ఓట్లను కోరుకుంటున్నారు. మీరు నరేంద్రమోడీని డ్యాన్స్ చేయాలని చెబితే, ఆయన డ్యాన్స్ చేస్తారు. వారు మీ ఓట్లను దొంగలించే పనిలో ఉన్నారు. వారు ఈ ఎన్నికలను అంతం చేయాలని అనుకుంటున్నారు. వారు మహారాష్ట్రలో ఎన్నికల్ని దొంగిలించారు. హర్యానా ఎన్నికల్ని దొంగిలించారు. బీహార్‌లో ఇదే ప్రయత్నం చేస్తున్నారు’’ అని అన్నారు.
ముందస్తు చర్యలతో తుఫాన్ ప్రభావం తగ్గించగలిగాం
మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, పంటనష్టం చోటుచేసుకున్నప్పటికీ, ముందస్తు చర్యల వల్ల నష్టం చాలా వరకు తగ్గించగలిగామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తుఫాన్‌కు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన ముందుచూపు, సమయోచిత నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో తుఫాన్ ప్రభావిత పంటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కూడా ఆయన వీక్షించారు. “మొత్తం 46 వేల హెక్టార్లలో వరి పంట, అలాగే 14 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో సమర్థవంతంగా పని చేశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోంది. పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాం.’ అని ఆయన పేర్కొన్నారు.
భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ లింక్.. శాటిలైట్ ఇంటర్నెట్ ట్రయల్స్ ప్రారంభం
ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ భారత్ లోకి అడుగుపెట్టింది. దేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని అంధేరి తూర్పు ప్రాంతంలో 1,294 చదరపు అడుగుల కార్యాలయాన్ని స్టార్ లింక్ ఐదు సంవత్సరాల పాటు అద్దెకు తీసుకుంది. కంపెనీ ముంబైలో శాటిలైట్ ఇంటర్నెట్ ట్రయల్ నిర్వహిస్తోంది, స్టార్ లింక్ టెక్నాలజీని ప్రజలకు VIPలకు పరిచయం చేస్తోంది. నివేదికల ప్రకారం, ముంబైని కేంద్రంగా దేశవ్యాప్తంగా పనిచేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇటీవల, లక్నో, నోయిడా, చండీగఢ్ వంటి నగరాలతో సహా దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో స్టార్ లింక్ గ్రౌండ్ స్టేషన్లు నిర్మించనున్నట్లు నివేదికలు వెల్లడించాయి.
ఇద్దరు యువరాజులు, రెండు అవినీతి కుటుంబాలు.. రాహుల్, తేజస్వీలపై ప్రధాని ఫైర్..
బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై విరుచుకుపడ్డారు. ‘‘అవినీతికి పాల్పడిన యువరాజులు’’ అని పిలిచారు. వీరిద్దరు ‘‘తప్పుదు హామీల దుకాణం’’ నడుపుతున్నారని ఆరోపించారు. బీహార్ లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన మెగా ర్యాలీలో గురువారం ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకులు భారత్, బీహార్‌లో అత్యంత అవినీతి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. రెండు కుటుంబాలు కోట్లాది రూపాయల కుంభకోణాలలో బెయిల్‌పై బయట ఉన్నారని అన్నారు. ఇద్దరు ప్రతిపక్ష నాయకులు తను దుర్భాషలాడుతున్నారని, సామాన్యుడు ఎదగడాన్ని వారు జీర్ణించుకోలేరని, దళితులను, వెనకబడిన వర్గాలను కించపరడచం వారి జన్మహక్కుగా భావిస్తున్నారని విమర్శించారు. ఒక పేద, వెనకబడిన కుటుంబానికి చెందిన టీ అమ్ముకునే వ్యక్తి, ఇప్పుడు దేశ అత్యున్నత పదవిని ఆక్రమించడాన్ని సహించలేదరని రాహుల్, తేజస్వీలను విమర్శించారు.
దేశమంతా ఎదురుచూసే బాహుబలిని అక్కడే చూస్తున్న జక్కన్న..
బాహుబలి.. భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. ఎపిక్’ పేరుతో బాహుబలి మొదటి భాగంతో పాటు రెండో భాగాన్ని మిక్స్ చేసి రాజమౌళి రీ-రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. నిజానికి ఈ మధ్యకాలంలో రీ-రిలీజ్ సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా బుకింగ్స్ ఒక రేంజ్‌లో అవుతున్నాయి. అయితే.. తాజాగా హైదరాబాద్ ప్రసాద్ పీవీఎక్స్ స్క్రీన్‌లో బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ ప్రీమియర్‌కి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. దేశమంతా ఎదురుచూసే బాహుబలిని ఫ్యామిలీతో కలిసి తిలకించారు. జక్కన రాకతో థియోటర్‌లో సందడి నెలకొంది.
బీహార్‌లో హత్యా రాజకీయాలు.. ఎన్నికల ప్రచారంలో తూటాకు బలైన నాయకుడు
బీహార్ ఎన్నికల్లో హత్యా రాజకీయాలు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒక నాయకుడు తూటాకు బలైన ఘటన గురువారం పాట్నా జిల్లాలోని మోకామా తాల్ ప్రాంతంలో వెలుగు చూసింది. జన్సురాజ్ అభ్యర్థి పియూష్ ప్రియదర్శి మద్దతుదారుడు ఆర్జేడీ మాజీ నాయకుడు దులార్‌చంద్ యాదవ్ గురువారం రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పుల్లో కాల్చి చంపబడ్డాడు. దులార్‌చంద్ యాదవ్ పియూష్ ప్రియదర్శికి మద్దతుగా తన మద్దతుదారులతో ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. స్థానికుల సమాచారం ప్రకారం.. మోకామా తాల్‌లోని ఒక గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితి త్వరగా తీవ్రమై, కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో దులార్‌చంద్ యాదవ్ ఛాతీ నుంచి తూటాలు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. తుపాకీ పేలుళ్ల మోతతో ఆ ప్రాంతం భయాందోళనకు గురైంది, వెంటనే ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీయడం ప్రారంభించారు. పియూష్ ప్రియదర్శి దులార్‌చంద్ యాదవ్ బంధువు అని సమాచారం.
సంగం బ్యారేజ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది.. అధికారులు చాకచక్యంగా రక్షించారు
మొంథా తుఫాన్ ప్రభావంతో పెన్నా నదిలో ఉధృతంగా పెరిగిన వరద ప్రవాహం నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్‌కు భారీ ప్రమాదం కలిగించే పరిస్థితి ఏర్పడింది. వరదలో కొట్టుకుపోయిన 30 టన్నుల భారీ బోటు బ్యారేజ్ గేట్లకు అడ్డంగా పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణ చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తుఫాన్ కారణంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లేలా చేశాయి. పెన్నా నదిపై ఉన్న సంగం బ్యారేజ్‌కు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. అదే సమయంలో భారీ బోటు ప్రవాహంలో కొట్టుకుపోయి బ్యారేజ్ వైపు చేరింది. అది గేట్లను తాకే పరిస్థితి వస్తే బ్యారేజ్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.
కృష్ణానది వరద పెరుగుతున్న ఉధృతి.. మరో ప్రమాద హెచ్చరికకు సిద్ధంగా అధికారులు
కృష్ణానదిలో వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ సమానంగా ఉండి భారీ నీటి ప్రవాహం కొనసాగుతోంది. తాజా వివరాల ప్రకారం, బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 5,38,867 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు మరికాసేపట్లో రెండవ ప్రమాద హెచ్చరిక (Second Danger Warning) జారీ చేసే అవకాశం ఉందని సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, “కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.