Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

వైఎస్ జగన్ పర్యటన జరిగి తీరుతుంది.. ఎవరు అవుతారో చూస్తాం!

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనపై ఉత్కంఠకు తెరలేపింది. రోడ్డు మార్గం ద్వారా మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. తమిళనాడు కరూర్‌లో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా జగన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ప్రకటించారు. జగన్ టూర్ కోసం భారీ జన సమీకరణ జరుగుతున్నందున 63 కిమీ రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు అవసరమైన భద్రత కల్పించడం కష్టం అని ఎస్పీ అన్నారు. హెలికాప్టర్ ద్వారా మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి కోరితే పరిశీలిస్తామని చెప్పారు.

బొత్స‌ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం!

శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త బొత్స సత్యనారాయణ కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బొత్స కుటుంబం విజయనగరంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. బొత్స కుటుంబంకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయగా.. సిరిమానోత్సవం ప్రారంభమైన కాసేపటికే వేదిక ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో బొత్స కుటుంబ సభ్యులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరిమానోత్సవ తిలకానికి ప్రత్యేకంగా అర్భన్ బ్యాంక్ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా కూలిపోయింది.

RRR, టిమ్స్, ఉప్పల్ ఫ్లైఓవర్‌లపై రెండు ప్రభుత్వాల మోసం స్పష్టంగా కనిపిస్తోంది

మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్రం-రాష్ట్రం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “మాటలు మాత్రం చెబుతున్నారు కానీ, ప్రాజెక్టు పనులు ఇప్పటికీ మొదలుకాలేదు” అని వ్యాఖ్యానించారు. వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. RRR ప్రాజెక్టు ఆలోచన మొదట కేసీఆర్ మదిలో పుట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు అవతల మరో రింగ్ రోడ్డు నిర్మిస్తే, నగరానికి భారీ డెవలప్మెంట్ వస్తుందని కేసీఆర్ భావించారని ఆయన చెప్పారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అనేకసార్లు అభ్యర్థించిందని గుర్తు చేశారు. “రెండేళ్ల తర్వాత కేంద్రం సూత్రప్రాయ అంగీకారం ఇచ్చింది. 2018లో DPR పంపితే 2021లోనే దానిని ప్రకటించారు. ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రాజెక్టు స్థితి మారలేదు” అని విమర్శించారు.

నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన వ్యాఖ్యలు

భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన రెండో భార్య జ్యోతి సింగ్. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో.. తనపై తన భర్త ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తన భర్త తనను నిర్లక్ష్యం చేశాడంటూ ఇన్ స్టా గ్రాం ద్వారా వీడియో రిలీజ్ చేసింది. భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లోనే రాణిస్తున్నాడు. ఇక ఇటీవల స్టేజ్‌పై అందరూ చూస్తుండగానే.. హీరోయిన్ అంజలి రాఘవ్‌ను అసభ్యకరంగా తాకారు. దీంతో ఆమె భోజ్‌పురి ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో.. తప్పు చేసినట్లు ఒప్పుకుని ఆయన క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం పవన్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన భార్య జ్యోతి సింగ్ ఆయనపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తీవ్ర ఆరోపణలు చేస్తూ వీడియో షేర్ చేసింది. తన భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని హోటల్‌కు వెళ్తున్నాడని తన ఇంటికి వెళ్తే తనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం రియాలిటీ వెబ్ సిరీస్ రైజ్ అండ్ ఫాల్‌లో కనిపిస్తున్న పవన్ సింగ్‌ను వేధింపులకు, మోసంకు పాల్పడ్డాడని జ్యోతి సింగ్ ఆరోపించారు.

ఆ సినిమా తర్వాత నాగచైతన్యతో శోభిత గొడవ..

హీరో నాగచైతన్యకు శోభితకు ఓ సినిమా వల్ల గొడవ అయిందంట. ఈ విషయాన్ని తాజాగా ఈ హీరో బయట పెట్టాడు. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు నాగచైతన్య గెస్ట్ గా వచ్చాడు. ఇందులో నాగచైతన్య తన భార్య శోభితతో జరిగిన ఓ గొడవ గురించి బయట పెట్టాడు. తండేల్ సినిమా తర్వాత నాతో శోభిత మాట్లాడటలేదు. ఆ మూవీ విషయంలో గొడవ పడింది. ఎందుకంటే నేను శోభితను ఎప్పటి నుంచో బుజ్జితల్లి అని పిలుస్తుంటాను. తండేల్ సినిమాలు అనుకోకుండా సాయిపల్లవికి పాత్రకు కూడా బుజ్జితల్లి అనే పేరు పెట్టాం. ఆ పేరు పెట్టడం వల్ల శోభిత అలిగింది. అందుకే మూడు రోజులు నాతో మాట్లాడలేదు అంటూ తెలిపాడు చైతూ.

ద్వీప దేశంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాల్లో భూకంపం ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఇంతకీ ఈ భూకంపం ఎక్కడ సంభవించిందో తెలుసా.. ద్వీప దేశం అయిన పపువా న్యూ గినియాలో. మంగళవారం దేశంలోని తూర్పు న్యూ గినియా ప్రాంతంలో 6.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. యూరో-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదికల ప్రకారం.. స్థానిక సమయం 11:05 UTCకి భూకంపం వచ్చింది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నివేదికలు స్పష్టం చేశాయి.

రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు

యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారులు ఫిన్ నెంబర్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఫేస్, ఫింగర్ ఫ్రింట్స్ ద్వారా పేమెంట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI).. సరికొత్త ఫీచర్ తో రానుంది. అక్టోబర్ 8 నుండి, వినియోగదారులు సంఖ్యా పిన్‌కు బదులుగా వారి ముఖం లేదా వేలిముద్రను ఉపయోగించి చెల్లింపులను ప్రామాణీకరించగలరని రాయిటర్స్ నివేదించింది. ఆధార్ డేటాతో నడిచే కొత్త బయోమెట్రిక్ ఆధారిత ప్రామాణీకరణ, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు లావాదేవీలను వేగంగా, సులభంగా, మరింత సురక్షితంగా చేయడానికి ఉపయోగపడుతుంది.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ.. ఇంకా నిర్ణయం తీసుకోని సీఎం చంద్రబాబు!

ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టీడీపీ నేతలతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ స్థానిక ఎన్నికలపైనా సీఎం చంద్రబాబు నేతలతో చర్చించినట్లు సమాచారం. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా టీడీపీ కూడా దూకుడు పెంచింది. సీఎం చంద్రబాబు వద్దకు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు వెళ్లారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీ చేయాలా? లేదా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా? అనే దానిపై మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో పోటీ చేద్దామని టీడీపీ నేతలు అంటున్నారట. బీజేపీతో పొత్తు ఉన్న కారణంగా సీఎం చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొలేదని సమాచారం. టీడీపీతో కలిసి వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఏదేమైనా త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

మహిళలకు ఉచితం, మగవారికి భారం..? కేటీఆర్ ఫైర్

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా ప్రభుత్వం చార్జీలు పెంచడం అన్యాయం అని ఆయన విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని, కానీ అదే సమయంలో పురుషులు, విద్యార్థులపై అదనపు భారాన్ని మోపుతోందని కేటీఆర్ మండిపడ్డారు. “ఇంట్లో ఒక మహిళ ఉచితంగా ప్రయాణం చేస్తే, కుటుంబంలోని మిగిలిన సభ్యులందరికీ రెండింతలు చార్జీలు కట్టాల్సి వస్తోంది. దీంతో ఒక కుటుంబానికి నెలకు కనీసం ఇరవై రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. ఈ విషయం ఇప్పుడు ప్రతి తెలంగాణ కుటుంబానికీ అర్థమైంది” అని ఆయన అన్నారు.

ఇంద్రకీలాద్రిపై రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి 2025 దసరా ఉత్సవాలు ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన హుండీ లెక్కింపులో రికార్డు స్థాయిలో ఆదాయం నమోదైంది. దసరా నవరాత్రుల 11 రోజుల హుండీ లెక్కింపు పూర్తవగా.. ఈసారి అమ్మవారి హుండీ ఆదాయం 10.30 కోట్లను దాటింది. గత సంవత్సరం 2024 దసరా నవరాత్రులలో 9.32 కోట్లు వస్తే.. ఈసారి దాదాపు ఒక కోటి రూపాయల పెరుగుదల నమోదైంది. ఇంద్రకీలాద్రిపై రెండు రోజుల పాటు ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. అధికారులు మొత్తం 106 సంచులు, 480 హుండీలు తెరచి లెక్కించారు. మొదటి రోజు 3.57 కోట్లు, రెండవ రోజు 6.73 కోట్లు లెక్కయ్యాయి. అదనంగా 387 గ్రాముల బంగారం, 19 కేజీల 450 గ్రాముల వెండి, అలాగే పలు దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీలో కనిపించాయి. భక్తుల విరాళాలతో అమ్మవారి హుండీ ఆదాయం ఈసారి రికార్డు స్థాయికి చేరుకుంది.

 

Exit mobile version