Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

హ్యాపీ బర్త్ డే.. ఎవర్ గ్రీన్ ‘డార్లింగ్’ ప్రభాస్!

రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్‌లో యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల కోసం, అక్కడి బాక్సాఫీస్ వసూళ్లే ఆయన యూనివర్సల్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తాయి. తన స్టార్‌డమ్, ఛరిష్మా, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే హీరోలుంటారు, కానీ టాలీవుడ్‌కే పేరు తెస్తున్న అరుదైన స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ చిత్రాలు రీ-రిలీజ్ కావడం, కొత్త సినిమాల అప్‌డేట్స్ రావడం ఆనవాయితీ. ఈ నెల 31న ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి: ది ఎపిక్’ (రెండు భాగాలు కలిపి ఒకే పార్ట్‌గా) తిరిగి విడుదల కానుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గోరక్షక్‌దళ్ సభ్యుడిపై ముస్లిం యువకుడి కాల్పులు.. గోవుల తరలింపు సమాచారం ఇస్తానని పిలిచి..

మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం గోరక్షక్ సభ్యుడు ప్రశాంత్ అలియాస్ సోనుపై కాల్పులు జరిగాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను గోవుల తరలింపు విషయంలో అడ్డుపడుతున్నాడని బహదూర్‌పురాకు చెందిన ఇబ్రహీం చౌదరి అనే వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిచినట్లు సమాచారం. ప్రశాంత్ అలియాస్ సోనుకి గోవుల తరలింపు సమాచారం ఇస్తానని కాల్పులకు ఇబ్రహీం తెగబడ్డాడు.

అలర్ట్.. నేడే తిరుమల శ్రీవారి జనవరి ఆర్జిత సేవా టికెట్లు విడుదల..

ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదలవుతాయి. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల చేస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలవుతాయి.

ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ దూరం! కారణమిదే!

ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈజిప్టు వేదికగా జరిగిన ఈ సమావేశానికి ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా మోడీ వెళ్లలేదు. తాజాగా మలేషియా వేదికగా అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశానికి కూడా ప్రధాని మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది.

దుబాయ్‌లో చంద్రబాబు రోడ్ షో.. రాష్ట్రాన్ని ఆవిష్కరించిన సీఎం..
దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషనుకు యూఏఈ పారిశ్రామికవేత్తలు రెస్పాండ్ అయ్యారు. సీఎం ప్రజెంటేషనుకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు పారిశ్రామికవేత్తలు.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. వ్యవసాయం మొదలుకుని టెక్నాలజీ వరకు.. గనులు మొదలుకుని స్పేస్ టెక్నాలజీ వరకు.. చిప్ మొదలుకుని షిప్ బిల్డింగ్ వరకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. పెట్టుబడుల గురించే కాకుండా.. ప్రజా సంక్షేమం కోణంలో చేస్తున్న పాలనాంశాలను గురించి సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి వస్తోన్న భారీ పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్.. కాసేపట్లో ఉమ్మడి ప్రకటన

మొత్తానికి బీహార్‌ విపక్ష కూటమిలో చోటుచేసుకున్న సంక్షోభానికి తెర పడింది. కూటమి పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. అశోక్ గెహ్లాట్ జరిపిన దైత్యం విజయవంతం అయింది. దీంతో ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ అభ్యర్థిత్వాన్ని అన్ని పార్టీలు అంగీకరించాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఇండియా కూటమి పార్టీలు సంయుక్త ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నారు.

తుని అత్యాచారం కేసు.. చెరువులోకి దూకిన నిందితుడి మృతదేహం లభ్యం..

తుని కోమటి చెరువులో నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ హాస్పటల్‌కి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నారాయణరావుని నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొని వెళ్తుండగా నారాయణ రావు వాష్ రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసుల తెలిపారు.

తెలంగాణలో మద్యం టెండర్లకు నేటితో ముగియనున్న గడువు

తెలంగాణలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ నేడు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ లేదా నిర్దేశిత కౌంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉంది. గత వారం బీసీ బంద్‌ , కొన్ని బ్యాంకుల మూసివేత కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామంటూ వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్‌ శాఖ, అసలు గడువును రెండు రోజుల పాటు పొడిగిస్తూ అక్టోబర్‌ 23 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన OG.. ఎక్కడంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. డే 1 రూ. 154 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సెన్సేషన్ స్టార్ట్ అందుకున్న ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ ఇంకా థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ. 310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇంతటి సంచనాలు సృష్టించిన OG ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రిలిజ్ కు ముందే భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఇప్పటికి థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమాను ఈ నెల 23నుండి అనగా నేటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది OG. 28 రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు హిందిలోను OG డిజిటల్ రిలీజ్ అయింది. థియేటర్స్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా OTT లో ఎలాంటి సంచలనం చేస్తుందో ఎంతటి వ్యూస్ రాబడుతుందో చూడాలి.

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం నేడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను మంత్రి మండలి పరిశీలించనుంది. అలాగే, ఈ ఎన్నికల్లో అమల్లో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను రద్దు చేయడానికి ఆర్డినెన్స్‌ ఆమోదించే అవకాశముందని సమాచారం.

 

Exit mobile version