జాగ్రత్త! న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు..
న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు… డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు జరిగే వేడుకలపై ఆంక్షలు విధించారు.. వేడుకల కోసం 3 స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్‌లు ముందుగానే అనుమతి తీసుకోవలని పోలీసులు తెలిపారు. వేడుకల నిర్వహణలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి అని వెల్లడించారు.. పోలీసులు ప్రకటన ప్రకారం.. రాత్రి 10 గంటల తర్వాత అవుట్‌డోర్ సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదు.. ఇండోర్ కార్యక్రమాలు మాత్రమే రాత్రి 1 గంట వరకు నిర్వహించవచ్చు… మైనర్లకు ప్రవేశం నిషేధము.. డ్రగ్స్, అశ్లీల కార్యక్రమాలు, ఫైర్‌వర్క్స్‌కు పూర్తిగా నిషేధం విధిస్తున్నారు.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు.. న్యూ ఇయర్ వేడుకలు సురక్షితంగా, క్రమబద్ధంగా జరగాలి.. నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకారించాలని పేర్కొన్నారు.
మాజీ మంత్రి రోజాపై టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు..
మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నగరి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, విజయపురం ఎంపీపీ లక్ష్మీపతిరాజు, నిండ్ర ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. నగరిలో మేమే రాజకీయంగా రోజాను నిలబెట్టాం. ఆమె రాజకీయ జీవితం మా వల్లే మొదలైంది. ఎంపీపీ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయి. కానీ, ఒక అబ్బాకు పుట్టావా? అంటూ మాట్లాడటం అత్యంత బాధాకరం అన్నారు.. నగరి నియోజకవర్గ చరిత్రలో అత్యంత దారుణంగా ఓడిపోయిన వ్యక్తి రోజానే. ఆమె జీవితంలో నగరిలో స్వయంగా గెలిచిన సందర్భం లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం అని హెచ్చరించారు.
భర్తతో గొడవ.. నవవధువు ఆత్మహత్య
హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని ప్రొద్దుటూరుకి చెందిన చందన జ్యోతికు కొత్తగూడెంకు చెందిన యశ్వంత్ కు మూడు నెలల క్రితం వివాహమైంది.. యశ్వంత్ ఓ ప్రైవేటు (medplus)లో ఉద్యోగం చేస్తున్నాడు.. ఇరువురు కలిసి మూసాపేట్ లో నివాసం ఉంటున్నారు.. కొద్ది రోజుల నుంచి ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉండటంతో చందన జ్యోతి మనస్తాపానికి గురైంది. గత రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని చందన జ్యోతి ఆత్మహత్యకి పాల్పడింది.. భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేశాడు. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.
యోగి అడ్డాలో బీజేపీకి కొత్త దళపతి..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అడ్డాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఆయన వెంట ఉన్నారు. డిసెంబర్ 14 ఆదివారం రోజు ఓటింగ్ రేపు జరుగుతుంది. ఆ తర్వాత కొత్త రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. అయితే పంకజ్ చౌదరి తప్ప మరెవరూ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఓటింగ్ జరిగే అవకాశం చాలా తక్కువ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన ఈరోజు ఢిల్లీ నుంచి లక్నోకు వచ్చినప్పుడు ఆయనకు సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీలందరినీ లక్నోకు పిలిపించామని, వాళ్లతో పాటు తాను కూడా వెళ్తున్నానని ఆయన చెప్పారు. యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గురించి అడిగినప్పుడు, అలాంటిదేమీ లేదని, తాను కేవలం సమావేశానికి వెళ్తున్నానని అన్నారు. అలాగే పార్టీ హైకమాండ్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని చెప్పారు. ఆ సమయంలో ఆయనతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యూపీ ఎన్నికల పరిశీలకుడు వినోద్ తవ్డే కూడా ఉన్నారు.
ఐఎస్ఐ నిఘాలో కేంద్ర మంత్రి.. భద్రత మరింత కట్టుదిట్టం
ఐఎస్ఐ నిఘాలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈక్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఒక లేఖ పంపింది. ఈ లేఖలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఐఎస్ఐ లక్ష్యంగా ఉన్నారని పేర్కొంది. దీంతో భద్రతా సంస్థలు ఆయన భద్రతను పెంచాయి. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించడంతో, ఆయనకు ఉన్న Z+ భద్రతతో పాటు మరింత మంది సెక్యూరిటీని పెంచారు. ఈ సమాచారం అందిన వెంటనే శుక్రవారం రాత్రి ఆయన భోపాల్ బంగ్లా వెలుపల అధికారులు భద్రతను పెంచారు. నిఘా అధికారుల హెచ్చరికల మధ్య కేంద్ర మంత్రి శనివారం రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. “ప్రతిరోజూ ఒక మొక్కను నాటాలనే నా ప్రతిజ్ఞకు అనుగుణంగా, భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్క్‌లో నా తోబుట్టువులతో కలిసి మొక్కలు నాటాను” అని రాశారు. ‘మొక్కలను నాటడం అంటే జీవితాన్ని నాటడం లాంటిదని, భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించడానికి, చెట్లను నాటడానికి, మన గ్రహాన్ని ఆకుపచ్చగా, సంపన్నంగా మార్చడానికి అందరం కలిసి రండి. మొక్కల పెంపకం ప్రచారంలో చేరడానికి, ఈ లింక్‌పై క్లిక్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి’ అని పోస్ట్ చేశారు.
ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్ వార్నింగ్
బలవంతంగా డబ్బులు వసూలు చేసేందుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌జెండర్లను సిపి సజ్జనార్ గట్టిగా హెచ్చరించారు. ఇటీవల కాలంలో ట్రాన్స్‌జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదని, ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించమని ఆయన తేల్చి చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటివారినైనా జైలుకు పంపిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయని గుర్తించుకోవాలని, అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.
పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా?
‘పెళ్లిచూపులు’ చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’, ‘కీడా కోలా’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్… ‘అంతకుముందు ఆ తర్వాత’, ‘అమీతుమీ’, ‘అరవింద సమేత’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సొగసైన నటి ఈషా రెబ్బతో ప్రేమాయణం నడుపుతున్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి వైపు అడుగులు వేస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే, వీరిద్దరూ వచ్చే ఏడాది (2026) వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ ప్రాజెక్ట్ ఫైట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించిన పోలవరం-నల్లమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి వివాదానికి కారణమైంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, దీనిని ఏ విధంగానైనా అడ్డుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా, ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ న్యాయ పోరాటం కోసం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించాలని ప్రభుత్వం అభ్యర్థించింది. దీనికి సంబంధించి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు-సెక్రటరీ రాహుల్ బొజ్జ, అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, ప్రాజెక్టు ప్రతిపాదనలు, అలాగే ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం గోదావరి, కృష్ణా నదీ జలాల పంపకాల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను వివరించనున్నారు.
భారత్ వైపు ప్రపంచం చూస్తోంది: మంత్రి కొండపల్లి
ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పోలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. పాతికేళ్ల క్రితం చంద్రబాబు ఎలా ఆలోచించారో మనం చూశాం, ఐటీకి భవిష్యత్తు ఉంటుందని నాటి యువతను ప్రోత్సహించారు, అవసరమైన మౌళిక సదుపాయాలను ఆనాడు ఏర్పాటు చేశారని అన్నారు. భారత్ వైపు ప్రపంచం చూస్తోందని, దేశంలో పెట్టుబడులు ఎలా పెట్టాలని, దేశీయ మార్కెట్‌లో ఎలా అడుగు పెట్టాలనే దానిపై ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు.
మెస్సీ ఎంట్రీ.. సెక్యూరిటీ టైట్
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీతో పాటు ఫుట్‌బాలర్లు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా నగరానికి వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్న మెస్సీ బృందం, సాయంత్రం 7 గంటల వరకు అక్కడే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ప్యాలెస్ వరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్యాలెస్‌లో సుమారు 250 మంది మెస్సీని కలవనున్నారని, వారికి ముందుగానే క్యూఆర్ కోడ్ ఆధారిత పాస్‌లు జారీ చేసినట్లు వెల్లడించారు.