Physical Harassment: తిరుపతిలోని శిల్పారామంలో లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. శిల్పారామం మ్యూజియం దగ్గర సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న మహిళపై లైంగిక దాడి చేసేందుకు యత్నించారు. శిల్పారామంలో పని చేస్తున్న ఓ మహిళ సెక్యూరిటీ గార్డును గత కొద్ది రోజులగా ఆఫీస్ ఉద్యోగి వెంకటరమణ లైంగికంగా వేధిస్తున్నట్లు తేలింది. తనకు లొంగక పోతే శిల్పారామం చైర్మన్, చైర్మన్ కొడుకుతో చెప్పి ట్రాన్స్ పర్ చేయించి, ఉద్యోగం తీసి వేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇక, వేధింపులు భరించలేక వెంకటరమణ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ తిరుపతి శిల్పారామం పరిపాలన అధికారికి మహిళ సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు చేసింది.
ఇక, శిల్పారామంలోని ఇతర మహిళ ఉద్యోగులను సైతం వేధిస్తున్నారని వెంకటరమణపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆఫీస్ ఉద్యోగిపై పరిపాలన అధికారి స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతైన విచారణ చేస్తున్నారు. నిందితుడు తప్పు చేసినట్లు ఆధారాలు దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.