Tirupati Man Harrassed A Vizag Woman Through Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఒక మహిళ కొంప ముంచింది. ఆ ఫ్రెండ్ మాయమాటలకు పడిపోయి.. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా నష్టాలు చవిచూసింది. ఆ మహిళ ‘ప్రేమ’ను పంచితే.. అతడు మాత్రం ఆమెను వాడుకున్నాడు. బెదిరింపులకు పాల్పడుతూ, భారీ డబ్బులు గుంజాడు. రానురాను అతని వేధింపులు మరీ ఎక్కువ అవడంతో, చివరికి ఆ మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. ప్రస్తుతం అతడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్టణంకు చెందిన ఒక వివాహితకు కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శేఖర్ (24) అనే యువకుడి నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసిన వెంటనే, అతడు మెసేజ్ చేశాడు. అలా చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టిన ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అనంతరం ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. చాటింగ్ ద్వారా మాయమాటలు చెప్పి, ప్రేమ పేరుతో వంచించాడు. తాను వివాహితనన్న సంగతి మరిచి, ఆమె అతని వలలో పడింది. ఈ తప్పే ఆమెను నిండా ముంచేసింది. కొన్నిసార్లు నగ్నంగా వీడియో కాల్స్ చేసుకున్నారు. అంతేకాదు.. చాటింగ్‌లోనూ అతనికి తన న్యూడ్ ఫోటోలను పంపింది. బూతు మాటలు మాట్లాడుకున్న వాయిస్ రికార్డింగ్స్ కూడా చాలానే ఉన్నాయి. వీటినే అడ్డం పెట్టుకొని శేఖర్ ఆమెని బెదిరించడం ప్రారంభించాడు.
తనకు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. సోషల్ మీడియాలో న్యూడ్ కాల్స్, వాయిస్ రికార్డింగ్స్‌ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో, ఆమె శేఖర్‌కు చాలాసార్లు డబ్బులు పంపింది. అయినా అతని వేధింపులు ఆగకపోవడంతో.. ఆమె విశాఖ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక సాయంతో శేఖర్ లొకేషన్ కనుగొని, అతడ్ని పట్టుకుని, విశాఖకు తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజ రుపరిచి, రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా.. శేఖర్ ఇప్పటికే ఒక హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్నట్టు తేలింది.