తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో మూడు రోజుల తర్వాత సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రేపు ,ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ. 13వ తేదీకి సంబంధించిన టోకెన్లు 12వ తేదీ ఉదయం నుంచి జారీ చేయనున్నారు.
తిరుమలకు పూర్వ వైభవం వస్తోంది. కలియుగ వైకుంఠనాథుడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోణా కారణంగా శ్రీవారి ఆలయంలో దర్శనం విధానంలో అనేక మార్పులు చేసింది టీటీడీ, ప్రస్తుతం సాధారణ రోజుల తరహాలో భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాటు చేసింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ప్రతినిత్యం 30 వేల టికెట్లను ఆన్లైన్ విధానంలో ముందస్తుగానే కేటాయించింది.
సర్వ దర్శనం క్యూలైన్ ద్వారా ప్రతి నిత్యం 30 వేల మంది భక్తులను ఆఫ్ లైన్ విధానంలో టోకెన్లు జారీచేసి దర్శనానికి అనుమతిస్తుంది. తిరుపతిలోని అలిపిరి ,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాలు వద్ద సర్వదర్శన భక్తులుకు టోకెన్ల జారీ చేస్తుండగా… ఇవాళ కౌంటర్ వద్దకు వెళ్ళిన భక్తుడికి 12వ తేదీకి దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు దర్శన సమయానికి ఒక రోజు ముందుగానే భక్తులను తిరుమలకు అనుమతించనున్నారు.
దీంతో రెండు రోజుల పాటు భక్తులు తిరుపతిలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు మూడు రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండడం వారిని ఇక్కట్లు గురిచేస్తోంది. అసలే వేసవి, ఉక్కపోత. ఆపై వసతి సౌకర్యం కూడా లభించక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు .దర్శనం టోకెన్లు పోందిన భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు టీటీడీ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.