శ్రీవారి ఆలయంలో వారపు సేవలు రద్దు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వేసవి శెలవుల సమయంలో సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం కేటాయించేందుకు వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చెయ్యగా….వీఐపీ బ్రేక్ దర్శనాలు కొనసాగిస్తూ…స్వామివారికి నిర్వహించే వారపు సేవలు రద్దు చెయ్యడం ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఎంతటి భక్తజన ప్రియుడో….అంతటి అలంకార ప్రియుడు….ఎంతటి అలంకార ప్రియుడో అంతటి ఉత్సవప్రియుడు…అందుకేనేమో శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కాని….అలంకరణ కాని మరే ఆలయంలో వుండవు….మరే దేవుడికి నిర్వహించరు అంటే అతిశయోక్తి కాదు. శ్రీవారికి ప్రతి నిత్యం రోండు పూటలా పూష్పాలంకరం నిర్వహిస్తూండగా….ప్రతి నిత్యం వేకువజామున నుంచి అర్దరాత్రి వరకు సేవలు నిర్వహిస్తారు.సుప్రభాత సేవతో మొదలైయ్యే స్వామివారి సేవలు…తోమాల,అర్చన,కళ్యాణోత్సవం,డోలోత్సవం,వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ,తిరిగి తోమాలసేవను నిర్వహించి….చివరగా ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఇక సోమవారం విశేష పూజ,మంగళవారం అష్టదళపాదపద్మారాధన,బుధవారం సహస్రకళషాభిషేకం,గురువారం తిరుప్పావడ,శుక్రవారం అభిషేక సేవను నిర్వహిస్తారు. ఇవి కాకుండా ప్రతి మాసంలోను వార్షిక ఉత్సవాలను శ్రీవారికి వైభవంగా నిర్వహిస్తారు. ఇలా ఏడాది అంతటా స్వామివారికి 450 వరకు ఉత్సవాలను నిర్వహిస్తుంటుంది టీటీడీ.
కోవిడ్ పూర్వమే శ్రీవారికి ప్రతి నిత్యం నిర్వహించే వసంతోత్సవం,ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజ,ప్రతి బుధవారం నిర్వహించే సహస్రకలశాభిషేకం సేవలను వార్షిక సేవలుగా మార్చి వేసింది టీటీడీ.ఈ మూడు సేవలలో ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తుండడంతో విగ్రహాలలో అరుగుదల కనిపిస్తూండడం….మలయప్పస్వామి వారి విగ్రహాలు 13వ శతాబ్దంలో మలయప్పకోనలో దొరికిన చారిత్రాత్మకమైన విగ్రహాలు కావడంతో….వాటికి ప్రత్యామ్నాయం కూడా లేకపోవడంతో….ఉత్సవ విగ్రహాల పరిరక్షణ కోసం ఆగమ పండితుల సూచన మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అటు తరువాత కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.
ప్రతి నిత్యం నిర్వహించే కళ్యాణోత్సవం మినహా మిగిలిన సేవలను మొదట్లో రద్దు చెయ్యగా….అటు తరువాత డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను ప్రారంభించింది.ఇక రెండు సంవత్సరాల అనంతరం ఏప్రిల్ 2వ తేదీ నుంచి శ్రీవారికి నిర్వహించే అన్ని సేవలను పున:ప్రారంభించీంది టీటీడీ. ఆర్జిత సేవలకు రెండేళ్ళ అనంతరం భక్తులును అనుమతించడం ప్రారంభించింది.మరో వైపు కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిన నేఫధ్యంలో దర్శనాల పై వున్న నియంత్రణ కూడా తొలగించింది టీటీడీ. దీంతో శ్రీవారి దర్శనానికి మార్చి,ఏప్రిల్ మాసంలోనే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం మెదలుపెట్టారు.
రెండు నెలల కాలంలోనే 40 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవుల సమయంలో భక్తులు తాకిడి మరింతగా పెరిగే అవకాశం వుండడంతో…సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వారపు సేవలను రద్దు చేసింది టీటీడీ. మంగళవారం రోజున నిర్వహించే అష్టదళపాదపద్మారాధన, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శనాలను రద్దు చేసింది. ఇప్పటికే వారాంతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చెయ్యడం….ఇప్పుడు వారపు సేవలు కూడా రద్దు చెయ్యడంతో సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం లభిస్తుందని భావిస్తోంది టీటీడీ. మరో వైపు స్వామివారికి నిర్వహించే సేవలను ….భక్తుల సౌలభ్యం పేరుతో రద్దు చెయ్యడం ఎంత వరకు సమంజసం అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి టీటీడీ పాలకమండలి నిర్ణయం మేరకు రాబోయే వారం నుంచే నూతన నిర్ణయాన్ని అమలు చెయ్యబోతుంది.
Tirupathi: గోవిందరాజస్వామి ఆలయంలో విశేష ఉత్సవాల షెడ్యూల్