ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల్ని ఓ పెద్దపులి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. 21 రోజులుగా
ప్రజలను అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో రాత్రి ప్రత్యక్షం అయింది. దీనిని బంధించేందుకు బోన్లు, సీసీ కెమేరాలు ఏర్పాటుచేసినా ఒక్కో రోజు ఒక్కో దిశ మార్చుకుంటూ అలజడి కలిగిస్తోంది.
గురువారం రాత్రి 11 గంటల సమయంలో పెద్ద శంకర్ల పూడి ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి వైపు వస్తుండగా కుక్కలు పెద్దఎత్తున అరవడంతో గ్రామస్తులు మేలుకొని అటువైపు వెళ్లే సరికి అక్కడినించి వెనుదిరిగి వెళ్లిపోయింది పెద్దపులి. ఇంటి గేట్ వరకు వెళ్లి వెను తిరిగినట్టు పాదముద్రల ద్వారా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. త్తిపాడు మండలంలోని పెద్ద పూడి, చిన్నశంకర్లంపూడి, ఏలేశ్వరం మండలంలోని భద్రవరం, లింగంపర్తి, కొండ తిమ్మాపురం, సి.రాయవరం గ్రామాల్లో సంచరిస్తుంది పెద్ద పులి.
మరోవైపు పెద్దపులి కోసం అన్వేషణ కొనసాగుతూనే వుంది. పెద్దిపాలెం సుబ్బారెడ్డి సాగర్ కుడి కాలువ గట్టు నుంచి గోకవరం సుబ్బారెడ్డి సాగర్ సమీప కొండల్లోకి పెద్దపులి ఇంతకుముందు వెళ్ళింది. గోకవరం నుంచి ఎరకంపాలెం, మెట్టు చింత, ఉలి గోగుల, వంతాడ కొండల పరిసరాల్లో ఉన్నట్టు సమాచారం. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు సమీపంలోఉన్నట్టు కూడా అధికారులు చెబుతున్నారు. అక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజవొమ్మంగి అడవులకు రెండు రోజుల్లో చేరుకుంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. పులిని బంధించేందుకు బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి.
Wandering Tiger : ఇంకా బోనులో పడని పెద్దపులి.. భయంలో జనం..