ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 6న నామినేషన్లకు చివరి గడువు, జూన్ 23న పోలింగ్ జరగనుంది. ఈనెల 26న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఉప ఎన్నిక కోసం విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హరేంధిర ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల నియామకం జరిగింది. దివంగత మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఫిబ్రవరి 21వ తేదీన హఠాన్మరణానికి గురైన సంగతి తెలిసిందే.
సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే కుటుంబ సభ్యులకు సిట్ ఇస్తే పోటీ చేయకూడదని బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారంగానే పోటీనుంచి తప్పుకుంది. ఆత్మకూరు లో ఏం చేస్తారనేది ఇంకా తేలలేదు. వైసీపీ అభ్యర్థిగా విక్రమ్ రెడ్డిని ప్రకటించగా.. టీడీపీ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ మాత్రం తాము ఖచ్చితంగా బరిలోకి దిగుతామని ఇదివరకే ప్రకటించింది. బీజేపీ నుంచి పోటీలో మేకపాటి మేనల్లుడు వుంటారని తెలుస్తోంది. జనసేన బీజేపీకి మద్దతు ఇస్తుందా? బద్వేల్ లోలాగా.. తప్పుకుంటుందా అన్నది తేలాల్సి వుంది.
ఆత్మకూరు స్థానానికి గౌతంరెడ్డి వారసుడిగా ఆయన తమ్ముడు మేకపాటి విక్రమ్‌రెడ్డిని వైసీపీ అధిష్ఠానం ఇప్పటికే ఖరారు చేసింది. రాజకీయాలకు దూరంగా, పూర్తిగా వ్యాపారానికే పరిమితమైన విక్రమ్‌రెడ్డి కుటుంబ సభ్యుల కోరిక మేరకు రాజకీయ ఆరంగేట్రం చేశారు. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు పరిచయమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
నియోజకవర్గంలోని వివిధ మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించి ఉప ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అంతేగాక ఆత్మకూరు నియోజకవర్గంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఎన్నికల ప్రచారాన్ని కూడా విక్రమ్ రెడ్డి ఆరంభించారు. వ్యాపారానికే పరిమితమయిన విక్రమ్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలతో పరిచయం లేదు. అయినా, ప్రజలకు ఇతనితో అనుబంధం ఏర్పడకున్నా మేకపాటి కుటుంబ వారసుడిగా ఇతని పేరు వేగంగానే ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈయన ఏకగ్రీవంగా ఎన్నికవుతారా, లేదా పోటీ తప్పదా అన్నదే హాట్ టాపిక్ అవుతోంది.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. దీని విషయమై ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు మరణించిన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు టిక్కెట్టు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ సంప్రదాయం వుంది. దీనిని బట్టి ఆత్మకూరులో టీడీపీ పోటీ చేయకపోవచ్చని ఆ పార్టీ జిల్లా నాయకత్వం అంటోంది. అయితే ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం అధికారిక ప్రకటన చేయకపోవడంతో పార్టీ శ్రేణులు, ఇతర రాజకీయ పక్షాల్లో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
బీజేపీ నిర్ణయంతో ఆత్మకూరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం లేనట్లే అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సమర్థుడైన అభ్యర్థి కోసం ఆ పార్టీ సీనియర్ నాయకులు గాలిస్తున్నారు. మరోవైపు మేకపాటి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని, ఈ ఎన్నికల ద్వారా మేకపాటి కుటుంబంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వెలుగులోకి తెస్తానని మర్రిపాడు మండలానికి చెందిన బిజివేముల రవీంద్రనాధరెడ్డి ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రకటించారు. బీజేపీ మద్దతు కోసం ఈయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులను గమనిస్తే ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీకి ఏకగ్రీవం కాదని, పోటీ అనివార్యం అంటున్నారు. పోటీ తప్పని పరిస్థితుల్లో భారీ మెజారిటీ దిశగా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Atchannaidu: మహానాడు గ్రాండ్ సక్సెస్.. చరిత్రలో నిలిచిపోతుంది