ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగ సంఘాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఇప్పటికే పలు మార్లు ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను కోరింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ మంత్రుల కమిటీ ఇప్పటికే పలుసార్లు ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. అయితే చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు హాజరుకాలేదు.
అయితే నేడు మరోసారి ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో సచివాలయం ఉద్యోగుల అసోసియేషన్ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వంతో చర్చలకు స్టీరింగ్ కమిటీలోని మొత్తం 20 మంది సభ్యులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్ల పై స్టీరింగ్ కమిటీ ఈ సమావేశంలో చర్చించనున్నారు. పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలి, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయట పెట్టాలి వంటి డిమాండ్లను స్టీరింగ్ కమిటీ పునరుద్ఘాటించనుంది.