రాజకీయ భీష్ముడు తెలుగు రాష్ర్టాల్లో మచ్చలేని మనిషిగా ఎదిగి రాజకీయల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్య మంత్రి కొణిజేటీ రోశయ్య అంత్య క్రియలు ఆదివారం మధ్యాహ్నం కొంపల్లిలోని తన ఫాంహౌస్‌లో పూర్తి అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. ఆయన అంత్య క్రియలకు ప్రముఖులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఆయనకు కన్నీట వీడ్కోలును పలికారు.
రోశయ్య మరణంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని రాజకీయ నాయకులు ఒక గొప్ప వ్యక్తి ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ సందర్భంగా పలువురు రోశయ్య రాష్ర్టానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా దేశంలో అత్యధిక సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలను రోశయ్య తీసుకుని రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి వెళ్లకుండా చేశారని పలువురు గుర్తు చేసుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం కరుణా నిధి సైతం రోశయ్య దగ్గర సలహాలు తీసుకున్నారంటే ఆర్థిక శాఖపై ఆయనకు ఉన్న పట్టు ఎలాంటిదో చెప్పవచ్చు.