Andhra Pradesh: ఏపీలో ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అయినా వైసీపీ ఈ అంశంపై ముందుకు వెళ్లి పేరు మార్పుపై జీవో విడుదల చేసింది. తాజాగా ఈ విషయమై టీడీపీ పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టింది. విజయనగరం నియోజకవర్గ కేంద్రంలో 17 వేల పోస్టు కార్డులను సేకరించింది. ఈ పోస్టు కార్డులను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ కార్యాలయాలకు పోస్ట్ చేస్తామని టీడీపీ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారని.. ఈ ఎయిర్‌పోర్టు కోసం టీడీపీ ప్రభుత్వం 2700 ఎకరాలు సేకరించిందని తెలిపారు.
అయితే భూములను ఆదా చేస్తున్నామని చెప్తూ వాటిలో 500 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం తగ్గించిందని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఆనాడు ఎకరాకు రూ. 17 లక్షల నుంచి 35 లక్షల వరకు బాధితులకు టీడీపీ నష్టపరిహారం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. నేడు కోట్లలో రేటు ఉండటంతో ఆ భూములను వెనక్కి తీసుకుని ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్గో, మెయింటైన్స్ కోసం ఆ భూమిని సేకరించామని.. ఇప్పుడు ఆ భూములు లేకపోతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అభివృద్ధి అంటున్నారు..ఇదేనా అభివృద్ధి అని నిలదీశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, బేగంపేట ఎయిర్‌పోర్టులకు చాలా తేడా ఉందని.. ఈ విషయం గమనించి భోగాపురం ఎయిర్‌పోర్టుకు కూడా అలాగే పూర్తి భూమిని ఉపయోగించి నిర్మాణం చేపట్టాలని అశోక్ గజపతిరాజు సూచించారు. ఆనాడు ఎవరూ దీనిపై మాట్లాడలేదని.. ఈ రోజు ఎక్సెస్ ల్యాండ్ అంటున్నారని.. ఈ అంశంలో ప్రజలను మిస్ లీడ్ చేయవద్దని కోరారు.
Read Also: Venkaiah Naidu: తెలుగు భాష కన్ను లాంటిది.. ఇంగ్లీషు భాష కళ్లద్దాలు వంటిది
ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 11 అంశాలకు సంబంధించి 5 అంశాలను కేంద్రం పూర్తి చేయలేదని రాజీనామా చేశానని అశోక్ గజపతిరాజు తెలిపారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కోడికత్తి డ్రామా చేశారని.. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సెక్యురిటీపై దాడి చేస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని హితవు పలికారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరుపై పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన టీడీపీ కార్యకర్తలకు అశోక్ గజపతిరాజు అభినందనలు తెలిపారు.