శుక్రవారం నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. ఒంగోలు సమీపంలో జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ సర్వం సిద్ధం చేసింది. మహానాడులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఒంగోలు బాట పట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 10 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మహానాడులో పాల్గొనేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఒంగోలు చేరుకున్నారు. మంగళగిరి నుంచి ఆయన కార్లు, బైక్ ర్యాలీలతో ఒంగోలు చేరుకున్నారు. ఆయరకు ఉమ్మడి జిల్లా సరిహద్దు మార్టూరు నుంచి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మార్గం మధ్యలో చిలకలూరిపేట, మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు ఆగి కాసేపు ప్రసంగించారు.
మరోవైపు ఒంగోలులో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మహానాడులో ప్రవేశపెట్టే పలు కీలక తీర్మానాలపై పోలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నిర్ణయించనున్నారు. మహానాడులో జనసేనతో పొత్తు అంశంపై స్పష్టత వచ్చే అవకాశముందని టాక్ నడుస్తోంది. టీడీపీ శ్రేణుల్లో ఇప్పటికే జనసేనతో పొత్తు ఉంటే లాభమనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బీజేపీతో ఎటువంటి వైఖరి అవలంభిస్తారో కూడా మహానాడు వేదికగా స్పష్టత వచ్చే అవకాశముంది.
అయితే అంతకుముందు చంద్రబాబు కాన్వాయ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. చంద్రబాబు ప్రయాణించే కారులో ఏసీ పనిచేయకపోవడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. తీవ్ర ఎండలకు తోడు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసీ పనిచేయలేదు. దీంతో ప్రత్యామ్నాయం లేక పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కారెక్కి చంద్రబాబు కొంతదూరం ప్రయాణించారు. అయితే కాన్వాయ్ వాహనాల కండిషన్ బాగోలేకపోవడంపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.