ఒంగోలు సమీపంలో టీడీపీ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం మహానాడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తుంటే వైసీపీకి కడుపు మంటగా ఉందని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక గడపగడపకు వెళితే జనం మొహం మీద కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలుగోడు అంటే తల ఎత్తుకునే పరిస్థితి ఎన్టీఆర్ తెచ్చారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఎవరైనా తమది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలంటే తలదించుకోవాల్సిన పరిస్థితిని జగన్ తెచ్చాడని ఆరోపించారు. భారత దేశ పౌరులకు ఉండే హక్కులు ఆంధ్రప్రదేశ్‌లో లేవా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా అని సోమిరెడ్డి నిలదీశారు. వైసీపీ తలకిందులుగా తపస్సు చేసినా పీకే లాంటి సన్నాసుల సలహాతో రాష్ట్రాన్ని నాశనం చేసినా టీడీపీ అధికారంలోకి వస్తుందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు ఏకైక నాయకుడని ప్రజలు డిసైడ్ అయ్యారని పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమం కోసం ఒంగోలులో మినీ స్టేడియానికి డబ్బులు కడితే పర్మిషన్ ఇవ్వలేదని.. తోరణాలు కడితే పీకేస్తున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.