తెలుగు అకాడమీ భారీ స్కాంలో బ్యాంకు సిబ్బంది పాత్ర కీలకంగా ఉందని అధికారులు గుర్తించారు. అకాడమీలోని లక్షల రూపాయల నగదు చేతులు మారిందని దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసును సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. కానీ తెలుగు అకాడమీ కేసులో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఉద్యోగులు కావడంతో సీసీఎస్ విచారణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థిక అవకతవకల్లో ప్రభుత్వ సిబ్బంది పాత్ర ఉన్నందున ఈ కేసు దర్యాప్తులో భాగంగా వారిని ఏసీబీ కోర్టులోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
వారిని ఏసీబీ కోర్టుకు ప్రవేశపెట్టాలన్నా ఏసీబీలో కేసు నమోదు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సీసీఎస్ అధికారులు అకాడమీలోని అవినీతికి పాల్పడిన అధికారులకు సంబంధించి నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లను (FIR 153, FIR 154, FIR 157) ఏసీబీకి పంపించారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నందున కేసు పూర్తిస్థాయి దర్యాప్తు సీసీఎస్ చేస్తుందని కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న నిందితులకు సంబంధించి మాత్రమే ఏసీబీ విచారిస్తుందని CCS జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు.