అనంతపురం జిల్లా టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన… వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. శనివారం ధర్మవరంలోని దుర్గానగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గౌరవసభ-ప్రజాసమస్యల చర్చావేదిక’ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువే.. గొడవలు ఎక్కువే..!
ధర్మవరంలో టీడీపీ టికెట్ తెచ్చుకుంటానని ఓ నాయకుడు ప్రచారం చేసుకుంటున్నారని, నిజంగానే ఆయన టికెట్ తెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని ఓ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు చేశారు. అయినా టీడీపీ కార్యకర్తలు ఇలాంటి విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరు దృష్టిసారించాలని పరిటాల శ్రీరామ్ కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్ అన్న విషయాన్ని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని పేర్కొన్నారు. కాగా గత ఎన్నికల్లో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పరిటాల శ్రీరామ్ ఓటమి చెందారు.