గుడివాడ కేసినో వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఛీర్ గాళ్స్ ఇండిగో విమానంలో వచ్చారని, ఉత్తరాది మహిళలు గుడివాడ ఎందుకు వచ్చారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. గుడివాడలో ఇటీవల కేసినో నిర్వహించారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో కొత్త ట్విస్ట్ లు బయటపడుతున్నాయి.
ఈ కేసినోలో చీర్ గాళ్స్ కూడా ఉన్నారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. కేసినోలో పాల్గొన్న చీర్ గాళ్స్ ప్రయాణ వివరాలను ఆయన బహిర్గతం చేయడంతో వ్యవహారం మరింతగా ముదిరింది. మొత్తం 13 మంది చీర్ గాళ్స్ ఇండిగో విమానం ద్వారా ప్రయాణం చేశారని వెల్లడించారు. గన్నవరం-బెంగళూరు, బెంగళూరు-గోవా, గోవా-విజయవాడ ప్రయాణికుల వివరాలను వర్ల రామయ్య మీడియాకు వివరించారు.
గోవా నుంచి విజయవాడ వచ్చిన వారి వివరాలు పోలీసులు సేకరించాలని వర్ల డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహిళలు గుడివాడ ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. కేసినో నిర్వహణకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. క్యాసినోలోకి ఎంట్రీ కావాలంటే పదివేలు, అక్కడ ప్యాకేజీ 50 వేల వరకూ వుందన్నారు. లాడ్జిలో వసతి, ట్రాన్స్ పోర్టు అన్నీ ఉచితమని వర్ల రామయ్య వివరించారు. తమ ఆధారాలపై మంత్రి స్పందించాలన్నారు.