వంగవీటి రాధాపై రెక్కీ వార్తలు ఏపీ పాలిటిక్స్‌లో కలకలం రేపాయి.. ఆ విషయాన్ని రాధాయే స్వయంగా బయటపెట్టడం.. ఆ తర్వాత ప్రభుత్వం 2+2 సెక్యూరిటీ కల్పించడం.. ఆయన తిరస్కరించడం జరిగిపోయాయి.. మరోవైపు.. రెక్కీ నిర్వహించినవారి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.. కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే.. వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప సీరియస్‌గా స్పందించారు.. రాధాను పార్టీలో చేర్చుకోవడం కాదు.. రెక్కీ నిర్వహించిన.. కుట్ర పన్నిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగా హత్యకేసులో ప్రధాన ముద్దాయి దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్‌కు వైసీపీలో పెద్ద పీట వేశారు అని మండిపడ్డ ఆయన.. రాధా హత్యకు రెక్కీ నిర్వహించిన అరవ సత్యం విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అని గుర్తుచేశారు.
Read Also: హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. వివరాలు ఇవే..!
ఇక, వంగవీటి రంగాను హత మార్చడంలో తప్పులేదన్న గౌతంరెడ్డికి సీఎం వైఎస్ జగన్.. ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ ఇచ్చారని మండిపడ్డారు నిమ్మకాలయ చినరాజప్ప.. రంగా హత్యతో టీడీపీకి సంబంధం లేదని వంగవీటి రాధా గతంలోనే బహిరంగ ప్రకటన చేశారని గుర్తుచేసిన ఆయన.. రాధాను పార్టీలోకి ఆహ్వానిస్తామన్న వైసీపీ నేతలు.. అరవ సత్యం, అవినాష్‌లను వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు..? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఇంకా రంగా హత్యను టీడీపీకి ఆపాదించి కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన.. నాడు రంగా హత్యను వైఎస్సార్ రాజకీయంగా వాడుకుంటే.. రాధాను హత్య చేసి.. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని జగన్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇప్పటికైనా జగన్ కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు చినరాజప్ప.