మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే చంపేందుకు కూడా వెనకాడటం లేదని, అధికార పార్టీ అరాచకాలకు పోలీసులు ఎంతలా వత్తాసు పలుకుతున్నారో ఈ ఘటనే నిదర్శనమని ఆయన ఆరోపించారు. మహిళను పోలీసులు జీపుతో తొక్కించారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు.
బాధితులపైనే తిరిగి కేసులు పెట్టి బెదిరించాలనుకోవడం దుర్మార్గమని, వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పోలీసులు ఎంతకైనా దిగజారుతున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసుల భుజాలపై తుపాకీ పెట్టి టీడీపీని బెదిరించాలనుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా ఘటనపై పోలీసు శాఖ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రూల్స్ కు వ్యతిరేకింగా వెళ్లినవారికి ఇబ్బందులు తప్పవని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని గుర్తు పెట్టుకోండని ఆయన వ్యాఖ్యానించారు.