Site icon NTV Telugu

Chandrababu and Pawan Kalyan: గంటకు పైగా చంద్రబాబు-పవన్ ఏకాంత చర్చలు.. అవసరమైతే మళ్లీ భేటీ..!

Chandrababu

Chandrababu

విజయవాడ నోవల్‌ టెల్‌ హోటల్‌లో బస చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఏకాంత చర్చలు జరిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తున్న నాకు పవన్‌ నోవాటెల్‌లో ఉన్నాడని తెలిసి.. అనుకోకుండా వచ్చి కలిసిశానని తర్వాత మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు చంద్రబాబు.. అయితే.. మొత్తంగా వీరి సమావేశం గంటా 20 నిమిషాల పాటు జరిగింది.. కొద్దిసేపు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌తో సహా పవన్‌ కల్యాణ్‌తో చర్చలు జరిపిన టీడీపీ అధినేత.. ఆ తర్వాత గంటకు పైగా పవన్‌ కల్యాణత్‌లో ఏకాంత చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది.. బీజేపీపై పవన్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన కాసేపటికే.. ఈ భేటీ జరగడం.. ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ముసుగుతొలిగిపోయిందని.. వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. పవన్‌, చంద్రబాబును టార్గెట్‌ చేసి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, టీడీపీ-జనసేన పొత్తు వైపు అడుగులు పడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.. గతంలో.. టీడీపీ, జనసేన, బీజేపీ పోటీచేసినట్టే.. మరోసారి ఆ పరిస్థితి రాబోతోందని కొందరు.. టీడీపీ-జనసేన మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ మరికొందరు అంచనా వేస్తున్నారు.

Read Also: Microsoft: ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. ఏకంగా వెయ్యి మంది ఇంటికే..!

ఇక, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చాను.. ప్రతిపక్ష నేతలు తిరగనీయకుండా దాడులు చేస్తున్నారు.. నాపై దాడి చేసి.. మా కార్యకర్తలపై కేసులు పెట్టారు.. పవన్‌పై దాడి చేసి జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టారని మండిపడ్డారు.. నేను విశాఖలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారు.. పవన్ విమానం దిగినప్పటి నుంచి ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారు.. పవన్ రాష్ట్రానికి పౌరుడు కాదా..? పవన్ విశాఖ వెళ్లకూడదా..? ప్రభుత్వమే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ.. తిరిగి ప్రతిపక్షంపై కేసులు పెడతారా..? రాజకీయ నేతలకే రక్షణ లేకుంటే.. సామాన్యులకు రక్షణ ఏది..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మనుషులను నిర్వీర్యం చేసేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.. ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.. 40 ఏళ్లుగా చూడని కొత్త రాజకీయం చూస్తున్నాను.. ప్రతిపక్షాలకూ స్వేచ్ఛ లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

ప్రభుత్వం తీరు వల్ల అధికార పార్టీ నేతల తీరు వల్ల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు.. వైసీపీ లాంటి నీచమైన పార్టీని చరిత్రలో చూడలేదు. ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుదాం అని పిలుపునిచ్చారు.. ప్రతిపక్ష పార్టీల మనుగడే లేకుంటే ప్రజల పరిస్థితేంటి.? అని ప్రశ్నించిన ఆయన.. ప్రతిపక్ష నేతలను తిట్టి, శారీరకంగా హింసించి ఆనందపడుతున్నారు అని ఫైర్‌ అయ్యారు.. అవసరమైతే మళ్లీ భేటీ అవుతామని తెలిపారు చంద్రబాబు.. అడుగడుగునా ఆంక్షలు పెట్టే పరిస్థితి పోవాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకుంటామన్న ఆయన.. అందరూ ఆలోచించాలి.. తక్షణ కర్తవ్యం ప్రజా స్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాం. ముందుగా ప్రజాస్వామ్య పరిరక్షణ ముఖ్యం.. ఆ తర్వాత ఎవరెలా పోటీ చేస్తారో అప్పటి పరిస్థితి బట్టి ఉంటుందన్నారు.. ఇక, అన్యాయానికి గురైన కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసే స్వేచ్ఛ పవన్‌ కల్యాణ్‌కు లేదా? అని ప్రశ్నించారు చంద్రబాబు.. పవన్‌కు తిట్లు తినే అలవాటు లేదు.. రాజకీయాల్లోకి వచ్చి తిట్లు తింటున్నారు.. ఇప్పుడు పవన్ బరస్ట్ అయ్యారన్నారు చంద్రబాబు.

మరోవైపు పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి రక్షణ లేకుండా పోయింది.. ప్రజాస్వామ్యం విలువలు కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.. విశాఖ ఘటనపై అన్ని రాజకీయ పార్టీలు నాకు సంఘీభావం తెలిపాయి.. తెలంగాణ నేతలు కూడా ఫోన్ చేసి మద్దతు తెలిపారు.. పార్టీల గొంతును నొక్కేస్తే ఎలా..? అని ప్రశ్నించారు. జనసేన-టీడీపీలనే కాదు.. మా సొంత మిత్రపక్షమైన బీజేపీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న ఆయన.. అన్ని పార్టీలు ప్రజాస్వామ్యం కాపాడేలా పోరాడాలన్నారు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలనూ కలుపుకెళ్తాం.. ముందుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.. ఆ తర్వాత రాజకీయం అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అయితే, ఏపీలో ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.. అవసరం అయితే, మరోసారి భేటీ అవుతామన్న చంద్రబాబు వ్యాఖ్యలతో.. పొత్తుల వైపు బాటలు పడుతున్నాయనే చర్చ సాగుతోంది.

Exit mobile version