టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. అసలు ఏం జరిగింది అనేదానిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు… తనపై చర్యలు తీసుకోవాలన్న ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో వాస్తవాలను వివరిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు.. మద్యం షాపుల సంఖ్య విషయంలో తానెక్కడా అవాస్తవాలు మాట్లాడలేదని లేఖలో స్పష్టం చేసిన అచ్చెన్న.. తనపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు ప్రతులు, నోట్ ఫైళ్లు.. ఉత్తర ప్రత్యుత్తరాలను పంపాలని కోరినా.. ఇప్పటి వరకు పంపలేదని లేఖలో పేర్కొన్నారు. సభలో మద్యం షాపులపై జరిగిన చర్చ సందర్భంగా తానెక్కడ నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడలేదని స్పష్టం చేసిన ఆయన.. తనకు అందుబాటులో ఉన్న రికార్డులను పంపుతానంటూ సభలో చర్చకు నోట్స్‌ను పంపారు.. ఇక, తాను ఉద్దేశ్యపూర్వకంగా సభను తప్పుదోవ పట్టించాననడం సరికాదని.. తాను చట్టానికి బద్ధుడనై వ్యవహరిస్తానని.. తనపై చేసిన ఫిర్యాదును డ్రాప్ చేయాలని లేఖలో కోరారు టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు.