Tomota Prices: ఏపీలో టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోటాకు కిలో రూపాయి మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమాటా దిగుబడి ఎక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండటంతో టమటా ధర దారుణంగా పడిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఏపీ నుంచి దిగుమతి అవుతున్న టమోటాలను తెలంగాణలో మాత్రం పలు ప్రాంతాల్లో కిలోకు 15 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. దీంతో మధ్యలో ఉన్న దళారీలు లాభపడుతున్నారు. సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిది అన్న తరహాలో ఈ వ్యవహారం నడుస్తోంది.
Read Also: CPI Narayana: బిగ్‌బాస్‌ను బ్యాన్ చేసే వరకు నా పోరాటం ఆగదు
సాధారణంగా రైతులు టమోటాలను కోయడానికి కూలీలకు, వాటిని మార్కెట్‌కు తరలించడానికి రవాణా ఖర్చులను భరించాల్సి ఉంటుంది. అయితే రేటు మాత్రం దారుణంగా పడిపోవడంతో కొందరు రైతులు టమాటాను పొలాల్లోనే వదిలేసి పశువులకు మేతగా వదిలేస్తున్నారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా దానిని ప్రభుత్వం అమలులోకి తేవడం లేదు. కనీసం కోల్డ్ స్టోరేజీలు కూడా అందుబాటులో లేవు. దీంతో రైతులు టమోటాలను రోడ్డుపైన పారబోసి వెళుతున్నారు. ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెడితే కనీస మద్దతు ధర కూడా పలకడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Also: Chandra Babu: డిసెంబర్ 5న ఢిల్లీకి చంద్రబాబు.. కారణం ఏంటంటే..?