శ్రీకాకుళం జిల్లాలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో వాలంటీర్లకు పురస్కారాలను ప్రధానం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు , పలువురు ఎమ్మెల్యేలు అధికారులు హాజరయ్యారు. ఐతే కార్యక్రమం జరుగుతున్న క్రమంలో 14 వార్డులోని ఐ జె.నాయుడు కాలనీకి చెందిన లొట్ల అనీల్ కుమార్ అక్కడికి వచ్చాడు . స్పీకర్ ను కలవాలంటూ సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్ జేబులోంచి తీసి మెడ, మణికట్టు భాగాలపై గాయపరచుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బ్లేడ్ దాడితో స్వల్పంగా అనిల్ కుమార్ గాయపడటంతో అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనిల్ కుమార్ గతంలో ఆమదాలవలస మున్సిపాలిటీ శానిటరీ వర్కర్ గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేశాడు. ఐతే ఏడాదిన్నర క్రితం అనిల్ కుమార్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో అప్పట్నుంచి తనకు ఉద్యోగం ఇప్పించాలని తమ్మినేని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. స్పీకర్ , ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ ( నాని ) చుట్టూ అనేక సార్లు తిరిగానని ..అయినా న్యాయం జరగలేదని తన లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని అనిల్ వాపోతున్నాడు.