Lunar Eclipse: నిత్యం భక్తులకు కిటకిటలాడే ప్రముఖ ఆలయాలు సైతం.. గ్రహణం వచ్చిందంటే మూతపడతాయి… అది సూర్య గ్రహణం అయినా, చంద్రగ్రహణం అయినా.. గ్రహణ సమయానికి ముందే మూసివేసి.. ఆ తర్వాత శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే పూజలు, అభిషేకలు నిర్వహిస్తారు.. దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. అయితే, శ్రీకాళహస్తిలో మాత్రం దీనికి భిన్నంగా.. గ్రహణ సమయంలోనూ ఆలయం తెరిచే ఉంటుంది.. గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీ వాయులింగేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇతర ఆలయాలకు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి ఉన్న ప్రధాన్య వ్యత్యాసం ఇదే.. నేడు రాహు గ్రహ పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగానూ.. శ్రీకాళహస్తి దేవస్థానం తెరిచి ఉంచి భక్తులకు స్వామి అమ్మ వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు..
Read Also: Weddings: మొదలైన పెళ్లిళ్ల సీజన్.. 40 రోజుల్లో 32లక్షల వివాహాలు.. లక్షల కోట్ల వ్యాపారం
శ్రీకాళహస్తి దేవస్థానంలో గ్రహనకాలంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు అర్చకులు.. భక్తులకు రాహు కేతు పూజలు యథాతధంగా నిర్వహించబడతాయని అధికారులు స్పష్టం చేశారు.. గ్రహణ స్పర్శకాలం సాయంత్రం 5.41 కాగా, మధ్య కాలం 5.45, మోక్షకాలం 6.19 గంటలకు చంద్రగ్రహణం కావడంతో విడుపు సమయమైన సాయంత్రం 6 గంటలకు స్వామి వారికి శాంతి అభిషేకాలు, ధూప, దీప, నివేదనలు సమర్పించనున్నారు. అనంతరం మళ్లీ శుద్ధి అభిషేకం, నైవేధ్యం, దీపారాధనలు అయ్యాక ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, పంచ భూత లింగాలుగా మహాశివుడు భూమిపై అవతరించాడని హందూ పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అందులో భాగంగా కంచీపురం, జంబుకేశ్వరం, తిరువణ్ణామలై, చిదంబరం, శ్రీకాళహస్తీ ప్రాంతాల్లో పంచభూత లింగాలకు ఆలయాలు సైతం ఉన్నాయి. అయితే వీటిలో భూ, జల, ఆకాశ, అగ్ని ప్రతీకలు ఉన్న ఆలయాలన్నింటిని సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో మూసివేసి, పరిసమాప్తి అయిన తర్వాత శుద్ధి, ఆచమనం నిర్వహించడం అనవాయితి. అప్పటి వరకూ ఎవరూ ఆలయాల్లోకి ప్రవేశించరు. కానీ, పంచభూత లింగాల్లో ముఖ్యమైనది వాయులింగం. పంచభూతాలకు ఎలాంటి భేదాలు, మలినాలు ఉండవని పెద్దలు చెబుతుంటారు. అయితే సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో మాత్రం పంచభూత ఆలయాల్లో నాలుగింటిని మూసివేసి కేవలం వాయులింగేశ్వరుడికి మాత్రమే అభిషేకాలను నిర్వహించడం విశేషంగా చెబుతుంటారు.