NTV Telugu Site icon

Cyclone Dana: దూసుకొస్తున్న ‘దానా’ తుఫాన్.. ఉద్దానంలో వణుకు..!

Uddanam

Uddanam

Cyclone Dana: తీరంవైపు దానా తుఫాన్‌ దూసుకొస్తుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. అధికార యంత్రాంగాన్ని, ప్రజలకు కీలక సూచనలు చేస్తోంది.. అయితే, దానా తుఫాన్‌ ఇచ్ఛాపురంపైనే అధిక ప్రభావాన్ని చూపుతుందనే అంచనాలతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఉద్దానం, తీర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత, అనుభవాల దృష్ట్యా.. దానా ఏం చేస్తుందో అనే టెన్షన్‌లో పడిపోయారు..

Read Also: Trains Cancelled: దానా ఎఫెక్ట్‌.. మరో 17 రైళ్లు రద్దు .. సమాచారం కోసం హెల్ప్‌లైన్‌‌ నంబర్లు..

అయితే, 1999లో అతి తీవ్ర తుఫాన్‌ ఒడిశాలో తీరం దాటినప్పుడు ఈ ప్రాంతంలో 12 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి.. వేల ఎకరాల్లో జీడి తోటలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం దానా తుఫాన్‌ సైతం ఒడిశాలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.. తిత్లీ తుఫాన్‌ దెబ్బకు 16 లక్షల కొబ్బరి చెట్లు నాశనం కాగా.. 55 వేల ఎకరాల్లో జీడి తోటలు నామరూపాలు లేకుండా పోయాయి. ఇక, ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో 40 వేల ఎకరాల్లో కొబ్బరి, 60 వేల ఎకరాల్లో జీడి తోటలు సాగు చేస్తున్నారు.. పదేళ్ల తర్వాత ఖరీఫ్‌లో వరి సాగు బాగుండటంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. కానీ, వారికి దానా భయం పట్టుకుంది.. తుఫాన్‌ ప్రభావం పడితే 80 వేల ఎకరాల్లో పంటకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. 2018 అక్టోబర్‌లో తిత్లీ తుఫాన్‌ సంభవించిందని.. అదే నెలలో దానా అతి తీవ్ర తుఫాన్‌ సంభవిస్తుందనే సమాచారంతో రెండు నియోజకవర్గాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏ క్షణాన ముప్పు వాటిల్లుతుందోనని మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ ఇళ్ల వద్ద కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు.. 2013లో ఫైలిన్ తుఫాను సృష్టించిన విధ్వంసం కూడా ఉద్దానం ప్రాంత ప్రజలను వెంటాడుతూనే ఉంది. వేలాది కొబ్బరి చెట్లు కోల్పోయిన పరిస్థితి అది.. మరి దానా తుఫాన్‌ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తోందోనని వణికిపోతున్నారు రైతులు, ప్రజలు..