ఒడిశా తీరప్రాంతంలో ‘దానా’ తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా, తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేశారు. గురువారం నుంచి ఈ నెల 29 వరకు కొత్తగా రద్దయిన రైళ్లను నిలిపివేస్తున్నట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. రద్దు చేయబడిన రైళ్ల సమాచారం కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 17 ముఖ్యమైన స్టేషన్లలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, ఖాజీపేట, ఖమ్మం, సామర్లకోట, వరంగల్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, ఏలూరు, గూడూరు, నిడదవోలు, ఒంగోలు, తిరుపతి, రేణిగుంట, డోన్ స్టేషన్లలోని హెల్ప్‌లైన్ కేంద్రాలు ప్రయాణికులకు 24 గంటలూ అవసరమైన సమాచారాన్ని అందజేస్తాయని పేర్కొంది. ఈ తుపాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య కేంద్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం కోసం 17 నగరాలు/పట్టణాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దాదాపు 200 రైళ్ల సర్వీసులను రద్దు, దారిమళ్లించినట్లు సమాచారం.
Read also: Custard Apple: సీతాఫలం పండ్లు తింటే శరీరానికి ఎంత మేలు తెలుస్తుందో తెలుసా?
మరోవైపు ఈ తుపానుతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా 23 నుంచి 25వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను ఇప్పటికే రద్దు చేశారు. ఈ నెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష కూడా వాయిదా పడింది. కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 24, 25 తేదీల్లో నందన్‌కనన్ జూ, బొటానికల్ గార్డెన్స్‌కు సందర్శకులను అనుమతించబోమని నిర్ణయించారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్, బితార్కానికా నేషనల్ పార్క్‌లను ఈ నెల 25 వరకు మూసివేయనున్నారు. తుపాను సమయంలో మూగజీవాలకు ఆశ్రయం కల్పించాలని మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి గోకులానంద మల్లిక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జంతువులు గాయపడినట్లు గుర్తిస్తే 1962 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.