PM Modi : సత్యసాయి బాబా సేవకు ప్రత్యక్ష రూపం అని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ.. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పుట్టపర్తి కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఆధ్యాత్మిక శక్తి, ప్రేమ, మానవానుకూలతలకు ప్రతీక. సత్యసాయి భౌతికంగా మనతో లేకపోయినా.. ఆయన ప్రేమ, ఆయన బోధనలు, ఆయన సేవా భావం ఇంకా కోట్లాది భక్తుల హృదయాల్లో సజీవంగా ఉన్నాయి అన్నారు.. సత్యసాయి బాబా ఎన్నో కోట్ల మందికి జీవన మార్గాన్ని చూపించారు. ప్రేమ, సేవ, నమ్మకం.. ఇవన్నీ ఆయన జీవితం మరియు సిద్ధాంతాల మూలసూత్రాలు.. భక్తి, జ్ఞానం, కర్మ.. ఇవన్నీ సేవతో ముడిపడి ఉంటాయని ఆయన తరచూ చెప్పేవారని గుర్తుచేశారు మోడీ..
Read Also: November 19: నవంబర్ 19.. భారత క్రికెట్ చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం..!
“మానవ సేవే మాధవ సేవ”,. ఈ ఒక్క వాక్యం ఆయన ఆధ్యాత్మికతకు ప్రతిరూపం అన్నారు నరేంద్ర మోడీ.. సత్యసాయి బాబా కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, మానవతకు సేవ చేసే యోధుడు. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు ఉచితంగా విద్య అందించడం, అత్యాధునిక వైద్యసేవలను పేదలకు పూర్తిగా ఉచితంగా అందించడం.. ఆయన సేవా దృక్పథానికి నిలువుటద్దాలుగా నిలిచాయి. ఒకప్పుడు రాయలసీమలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండేది. అయితే సత్యసాయి ట్రస్ట్ ద్వారా వేలాది గ్రామాలకు సురక్షిత తాగునీరు చేరింది. ఇది ఆ ప్రాంత ప్రజల జీవితాలను మార్చిన చారిత్రాత్మక సేవ అన్నారు..
సత్యసాయి బాబా జీవిత తత్వం ఒకే మాటలో చెప్పాలంటే “వసుధైక కుటుంబం”. దేశం, మతం, భాష అనే గడియారాలు ఆయనకు అర్థంలేనివి.. ప్రేమ, సేవ, మానవత మాత్రమే ఆయన ధ్యేయం అన్నారు ప్రధాని మోడీ.. మరోవైపు మహిళలు, బాలికల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధాని.. బాబా బోధనలను గుర్తుచేసుకుంటూ.. మన ప్రభుత్వం 20 వేల మంది బాలికల పేర్లతో సుకన్య సమృద్ధి యోజన ద్వారా నిధులు జమ చేసింది. ఆ బాలికలు భవిష్యత్తులో విద్య, అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయడానికి ఇది ఒక దీప్తిమంతమైన మార్గం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ..