Minister Narayana: నెల్లూరులో వివిద శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారు.. అందులో నేను కూడా బాధితుడినే అన్నారు. కానీ, ఇప్పుడు తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది చెప్పారు. గతంలో మాదిరిగా అర్ధరాత్రి అరెస్టులు చేయడం లేదన్నారు. రాష్ర్ట అభివృద్ధికి శాంతి భద్రతలు ఎంతో ముఖ్యం.. దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని తేల్చి చెప్పారు. కొన్ని రోజులు ఆగితే అన్నే వస్తాయి.. తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తారు.. ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు.
Read Also: Vijayawada: ట్రాఫిక్ సీఐతో వాహనదారుడు వితండ వాదం.. ఐడీ కార్డు చూపించాలంటూ..!
ఇక, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపొందించామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మున్సిపాలిటీలకు వివిధ రకాలుగా వచ్చే ఆదాయాన్ని ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికే వెచ్చిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది.. గత ప్రభుత్వ హయాంలో నిధులన్నీ సీఎఫ్ఎంఎస్ కు వెళ్ళేవి.. దీని వల్ల చిన్న పనులకు కూడా ఇబ్బంది పడ్డారు.. 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లించారు అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ మంచి నీటి కుళాయిని ఇస్తాం.. మూడేళ్ళలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బ్రష్టు పట్టించింది అని వెల్లడించారు. తమ ప్రభుత్వం దాన్ని గాడిలో పెడుతుంది.. మరో ఆరు నెలల్లో అభివృద్ధి ఊపందుకుంటుంది అని నారాయణ చెప్పుకొచ్చారు.