NTV Telugu Site icon

Special Trains for Sankranti: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. మరో 16 ప్రత్యేక రైళ్లు

Train

Train

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఎలాగైనా.. ఎన్ని కష్టాలు భరించైనా సొంత ఊరికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు తెలుగు ప్రజలు.. దీంతో, పండు సీజన్‌లో విమానాలు, రైళ్లు, బస్సులు.. ఇలా ఏవి ఆశ్రయించినా ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. దీంతో, సొంత వాహనాల్లో కూడా ఊరికి వెళ్లేవారు ఉన్నారు.. అయితే, సంక్రాంతి పండుగకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే… ఇప్పటికే సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.. అయినా, ప్రయాణికుల నుంచి డిమాండ్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో, ప్రయాణికులకు మరికొంత ఉపశమనం కలిగించేలా.. మరో 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడుపనున్నారు. గతంలో ప్రకటించిన రైళ్లకు ఈ సర్వీసులు అదనం.

Read Also: Narayana Swamy: రాజకీయ పరిజ్ఞానం లేని లోకేష్ నీకెందుకు పాదయాత్ర..?

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, వికారాబాద్‌ నుంచి నర్సాపూర్‌, మచిలీపట్నం, కాకినాడ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు అధికారులు.. సంక్రాంతి సీజన్‌లో ఈ మార్గాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చారు.. ప్రత్యేక రైళ్లలో రిజర్వ్‌డ్‌, అన్‌రిజర్వ్‌డ్ బోగీలను అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను రాత్రి పూట నడుపనున్నారు. ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ కేంద్రాల్లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ లేని ప్రయాణాలకు యూటీఎస్‌ యాప్‌ ద్వారా టిక్కెట్లను బుక్‌చేసుకోవచ్చు.. మరోవైపు, నూతన సంవత్సరం సందర్భంగా 31వ తేదీన అర్ధరాత్రి తర్వాత కూడా ఎంఎంటీఎస్ రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి ఫలక్ నుమాకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఇక, న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు హైదరాబాద్‌ మెట్రోరైలు అధికారులు ప్రకటించారు.. 31న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు తిరగనున్నాయి.. రాత్రి ఒకటి గంటకు మొదటి స్టేషన్ నుండి బయల్దేరనున్న చివరి మెట్రో రైలు.. రెండు గంటలకు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.

కాగా, సంక్రాంతి పండుగ దృష్ట్యా, దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాల మధ్య 92 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.. ప్రత్యేక రైలు సర్వీసులు వివిధ కోచ్ కూర్పును కలిగి ఉంటాయి, వీటిలో రిజర్వ్‌డ్ మరియు అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు అన్ని విభాగాల ప్రయాణికులకు సేవలు అందజేస్తాయని అధికారులు వెల్లడించారు.. రిజర్వ్ చేయబడిన వసతి కోరుకునే ప్రయాణికులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు కాకుండా IRCTC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు మొబైల్ యాప్ ద్వారా తమ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు; తద్వారా టిక్కెట్‌ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడడం మానుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పుడు.. మరో 16 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చేశాయి.

Show comments