NTV Telugu Site icon

Somu Veerraju: నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. వైఎస్‌ వివేకా కేసులో ఎవ్వరినీ కాపాడం..!

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. తిరుపతిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతోందన్నారు.. అయితే, ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం ఎవ్వరినీ కాపాడదు అని.. సీబీఐ తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.. ఇక, వెయ్యి కోట్ల రూపాయలు అంటూ ఏపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి.. వీటికి చరమగీతం పాడుతాం అన్నారు సోము వీర్రాజు. మరోవైపు.. ఇప్పుడు నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యే లు ఉంటున్నారు.. ఎమ్మెల్యేల కుటుంబీకులు అరాచకాలు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: YS Jagan Tenali Tour: రేపు తెనాలి పర్యటనకు సీఎం జగన్.. వారికి గుడ్‌న్యూస్‌

ఎమ్మెల్సీ ఎన్నికలకు తిరుపతిలో దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపణలు గుప్పించారు సోము వీర్రాజు.. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ ఏజెంట్‌గా పనిచేయదన్న ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇక, తనపై మా పార్టీ నేతలు ఎవరూ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదన్నారు వీర్రాజు.. మరోవైపు.. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ వల్ల సీమకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు.. కాగా, గత కొంత కాలంగా ఏపీ బీజేపీలో పరణామాలు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు మాజీ మంత్రి, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఆయన దారిలోనే మరికొందరు నేతలు కూడా రాజీనామా చేస్తారనే చర్చ సాగుతోంది.. ఇంకోవైపు.. కొందరు ఏపీకి చెందిన బీజేపీ నేతలు.. సోము వీర్రాజుపై గుర్రుగా ఉన్నారని.. వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారనే ప్రచారం సాగింది.. ఈ తరుణంలో.. తనపై అధిష్టానికి ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.