Somu Veerraju: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుపై ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. రాజమండ్రిలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి లేవని ప్రజలు చెప్పాలంటూ అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. మాతో ఎవరు కలిసి ఉన్నారో లేదో మేమే చెప్పాలి అన్నారు… అసలు, బీజేపీతో టీడీపీ కలుస్తుందంటే అచ్చెన్నాయుడు ఏం చెబుతారు? అంటూ ప్రశ్నించారు. ఇక, రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టత కోసం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది.. పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.. ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త తులసీ రామచంద్ర ప్రభు.. బీజేపీలో చేరతారని తెలిపారు.. బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యే పార్టీ పెద్దల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని వెల్లడించారు.. అంతేకాదు.. త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా పెద్దఎత్తున నేతలు.. బీజేపీలో చేరుతారంటూ హాట్ కామెంట్లు చేశారు. గుంటూరులో ఈనెల 24వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు సోమువీర్రాజు.
Read Also: MLC Shaik Sabji: టీటీడీ విజిలెన్స్ వలలో ఎమ్మెల్సీ..
కాగా, బీజేపీలో వలసలు కొనసాగుతున్నాయి.. మొన్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ గూటికి చేరగా.. ఇవాళ వ్యాపారవేత్త తులసీ రామచంద్ర ప్రభు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో త్వరలో చేరికలు ఉంటాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.. అసలు బీజేపీలో చేరే ఆ నేతలు ఎవరు? అని అన్ని పార్టీలో చర్చ సాగుతుందట.